ఆయా కులాలకు మీరు చేసింది నయవంచన,నమ్మకద్రోహం కాక మరేమిటి?

08–08–2018, బుధవారం 
పారుపాక క్రాస్, తూర్పుగోదావరి జిల్లా

నేటి పాదయాత్రకు వర్షం అడ్డంకిగా మారింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం వరకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఈ రోజు నడిచిన గిడిజాం, ఎస్‌.అగ్రహారం గ్రామాల్లో కాపులు, బలహీనవర్గాలు అధికశాతం ఉన్నారు. పలు సమస్యలతో ఇక్కట్లపాలవుతున్నా.. మరిచిపోలేని ప్రేమాభిమానాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో దారి పొడవునా చీరలు పరచి నడిపించారు. అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఆ విధంగా నడిపించి, ఆప్యాయతతో స్వాగతించడం ఆనవాయితీ అట.  

పింఛన్లు రాలేదని, ఉన్న పింఛన్లు పీకేశారని, ఇళ్లు ఇవ్వడం లేదని, రుణాలు మంజూరు చేయడం లేదని, గిట్టుబాటు ధరలు లేవనే ఫిర్యాదులు ఈ రోజు ఎక్కువగా వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన నిరుపేద వితంతువులు పిల్లా సీత, అమ్మాజీ అనే ఆడపడుచులు కలిశారు. వీరు ఇద్దరిద్దరు ఆడబిడ్డలతో బతుకు భారంగా గడుపుతున్నారు. ఇద్దరికీ వితంతు పింఛన్లు రావడం లేదట.  


ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుడైన తన భర్తకు పింఛన్‌ తొలగించారని గిడిజాంకు చెందిన గొలుసు లక్ష్మి అనే సోదరి, వృద్ధాప్య పింఛన్‌ను ఆపేశారని 75 సంవత్సరాలు పైబడ్డ పంపనబోయిన సూర్యారావు బాధపడ్డారు. అన్ని అర్హతలున్నా ఇల్లు ఇవ్వడం లేదంటూ.. మండపంకు చెందిన వీరలక్ష్మి, గిడిజాంకు చెందిన నూకా రత్నం.. ఇలా ఎంతోమంది ఈ రోజు ‘పేరుకే పేదల కోసం సంక్షేమ పథకాలు.. అవి మాలాంటి వారికి అందని ద్రాక్షలు’అంటూ ఉసూరుమన్నారు.  

పిఠాపురం నియోజకవర్గం విరవ గ్రామానికి చెందిన రామిశెట్టి సత్యనారాయణ ఒక కాలు లేకున్నా.. నన్ను కలిసి కష్టం చెప్పుకోడానికి ఇంతదూరం వచ్చానన్నాడు. ఆ అన్న ఒకానొక ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఒక కాలును పూర్తిగా తొలగించేశారు. బతుకుదెరువు లేదు.. బతికే దారే లేదు.. ఉపాధి కోసం అక్కర కొస్తుందని కాపు కార్పొరేషన్‌ రుణం కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా, ఎంతమందికి మొరపెట్టుకున్నా కనికరించలేదని కన్నీరు పెట్టుకున్నాడు.. వీరందరినీ చూస్తుంటే విస్మయం కలిగింది. వీరికన్నా అర్హులు ఉంటారా? సంక్షేమం అనేది అసలు ఉందా? ఇదేం పరిపాలన? పింఛన్లు రావడం లేదని గ్రామగ్రామాన ప్రజలు మొరపెట్టుకుంటుంటే.. అందరికీ పింఛన్లు ఇచ్చామని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని బూటకపు మాటలు చెబుతున్నారు ప్రభుత్వాధినేతలు.

ఇళ్లే ఇవ్వడం లేదని ప్రజలు వాపోతుంటే.. అర్హులందరికీ ఇళ్లిచ్చాం.. సామూహిక గృహ ప్రవేశాలంటూ.. సంబరాలు చేసుకోండంటూ మభ్యపెడుతున్నారు. మరోవైపు కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని మోసం చేసి అరకొరగా నిధులిచ్చారు. అవి కూడా అర్హులైనవారికి అందడం లేదు. నిజమైన నిరుపేదలకు అందనప్పుడు, కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడవలేనప్పుడు పథకాలు ఉండి ఏం లాభం? కార్పొరేషన్‌లు పెట్టి ఏం ప్రయోజనం? ఎంతసేపూ ప్రజలను మభ్యపెట్టి, మోసపుచ్చి, మాయమాటలు చెప్పి ఎన్నికల వేళ ప్రలోభపెట్టి ఓట్లు పొందాలన్న యావే తప్ప.. వారి కష్టాలు తీర్చి, అభిమానాన్ని చూరగొనాలన్న ఆలోచనే లేకపోవడం దురదృష్టకరం. అందుకే నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు.. ‘ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం. ఎంతకాలం పరిపాలించామన్నది కాదు.. ఎంతమందికి మేలు చేశామన్నది ప్రధానం’అని. 

గిడిజాంలో గొల్ల సుబ్రహ్మణ్యం అనే 75 ఏళ్ల తాత కలిశాడు. కళ్లు కూడా సరిగా కనిపించవు. కాపులకు బాబు చేసిన మోసాన్ని చెప్పు కొచ్చా డు. మాటమీద నిలబడే నాన్నగారంటే వల్లమాలిన అభిమానమన్నాడు. ‘రాజశేఖరా.. రావయ్యా మళ్లీ’అంటూ తను స్వయంగా కూర్చిన పాటను ఎంతో హృద్యంగా, ఆర్ద్రతతో పాడి వినిపించాడు. ఆ పెద్దాయన గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ పాట.. నాన్నగారి ఔన్నత్యాన్ని కళ్లకు కట్టింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోపే కాపులను బీసీలలో చేర్చేస్తానని హామీ ఇచ్చారు.. ఇంకో ఆర్నెల్లలో మీ పదవీకాలం పూర్తవబోతోంది.. మరి కాపు సోదరులను బీసీలలో చేర్చేశారా? కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామన్నారు.. ఇప్పటికీ రూ.5,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. మీరిచ్చింది కేవలం రూ.1,340 కోట్లు మాత్రమే. అంటే.. రూ.3,660 కోట్లు కాపులకు బకాయిపడ్డారు. ఈ ఆరు నెలల్లో అవి తీర్చే ఉద్దేశం ఉందా? తెలియక చేస్తే పొరపాటు అంటారు. తెలిసి పొరపాటు చేస్తే దాన్ని తప్పు అంటారు. తెలిసి తప్పు చేస్తే దానిని మోసం అంటారు. మరి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, దేశంలోనే అత్యంత సీనియర్‌ నేతనని చెప్పుకొనే మీరు.. కాపులు మొదలుకుని బోయ, కురుబ, మాదిగ, మత్స్యకార, రజక కులాలకు చేసిన వంచనకు మోసం అనే పదం సరిపోదేమో. దీనిని నయవంచన, నమ్మకద్రోహం కాక మరేమంటారు?  
‍ - వైయ‌స్ జ‌గ‌న్‌Back to Top