108 పథకానికి పట్టిన దుర్గతిని చూసి చాలా బాధనిపించింది

 
01–08–2018, బుధవారం  
తాటిపర్తి క్రాస్, తూర్పుగోదావరి జిల్లా


ఈ రోజు మధ్యాహ్నం 108 సిబ్బంది ప్రతినిధులు కలిసి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐదో తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. ఈ పాలనలో 108 వాహనాల దుస్థితి, సిబ్బంది దయనీయ పరిస్థితుల గురించి వారు చెబుతుంటే.. మనసు చివుక్కుమంది.   నాన్నగారు మొదలెట్టిన 108 వ్యవస్థ స్ఫూర్తితో.. 16 రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు.. పొరుగు దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచింది. అలాంటి పథకం ఇప్పుడు మన రాష్ట్రంలో దీనావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు 108 సిబ్బంది. అరకొర జీతాలు, వెట్టి చాకిరీ, కనీస కార్మిక చట్టాలు కూడా అమలుకాని దౌర్భాగ్య బతుకులు మావంటూ తీవ్ర నిరాశ వెలిబుచ్చారు.


మూడు నెలలుగా జీతాలే రావడం లేదని బావురుమన్నారు. మండలానికి ఒక వాహనం ఉండాల్సి ఉండగా.. నియోజకవర్గానికి ఒకటి, కొన్ని చోట్ల రెండు మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్నో వాహనాలు మూలనపడ్డాయని, అరకొరగా పనిచేస్తున్నవి ఎప్పుడాగిపోతాయో తెలియని పరిస్థితుల్లో తిరుగుతున్నాయని తెలిపారు. ఆక్సిజన్‌ కూడా అందుబాటులో ఉండక, ఎమర్జెన్సీ మందులు అసలే లేక.. పేద రోగుల పాలిట దేవదూతల్లా కదిలొచ్చే వాహనాలిప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లా ఉన్నాయన్నారు. పతనావస్థలో ఉన్న ఈ 108 వ్యవస్థను పరిరక్షించుకోవడానికి విధిలేని పరిస్థితుల్లో సమ్మె బాట పడుతున్నామని ఆ సోదరులు చెప్పారు. దేశానికే ఆదర్శమైన 108 పథకానికి పట్టిన దుర్గతిని చూసి చాలా బాధనిపించింది.  

గొల్లప్రోలుకు చెందిన ఓ కౌలు రైతు కుటుంబ వ్యథ వింటుంటే.. ఈ పాలనలో వ్యవసాయం ఎంతలా సంక్షోభంలో కూరుకుపోయిందో మరోసారి స్పష్టమైంది. వరుస పంట నష్టాలు, వ్యవసాయం కోసం చేసిన ప్రయివేటు అప్పులు మా కుటుంబాన్ని నిలువునా ముంచాయంటూ.. అడపా దేవి అనే సోదరి కన్నీరు పెట్టింది. కౌలు రైతు అయిన ఆమె తండ్రి 39 ఏళ్ల వయసులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం ఆ రైతన్న.. అప్పులు తీర్చడం కోసం తనకున్న కాస్త పొలాన్ని, చిన్నపాటి ఇంటిని కూడా అమ్మేశాడట. అయినా కష్టాలు తీరని పరిస్థితి. తీవ్ర మానసిక క్షోభతో మూడేళ్ల కిందట ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబానికి పరిహారం అందించాల్సిన బాధ్యతను మరచిన ఈ ప్రభుత్వం.. కనీసం పరామర్శకు కూడా వెళ్లకపోవడం శోచనీయం.

రైతాంగానికి ఇక ఈ పాలనపై నమ్మకం ఏముంటుంది? గొల్లప్రోలు మండలంలోనే ఈ నాలుగేళ్లకాలంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారట. ఏ ఒక్కరికీ పరిహారం అందించిన పాపాన పోలేదట. పరామర్శ కూడా కరువేనట. కరువు ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలన్న తేడా కూడా లేకుండా.. అన్ని చోట్లా రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం.. రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికున్న తీవ్ర నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.  ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేసిన సోదరి కమల గొల్లప్రోలులో కలిసింది. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న నర్సులను క్రమబద్ధీకరించాలని, గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని కోరింది. ఎంతో ఆప్యాయతతో, ప్రేమాభిమానాలతో, తన చేతికళతో మా కుటుంబ సభ్యుల పేర్లను అందంగా అల్లిన చేతి రుమాళ్లను బహూకరించింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి నియోజకవర్గంలో సగానికి పైగా 108 వాహనాలు మూలనపడ్డ విషయం వాస్తవం కాదా? కాగా, మీ డ్యాష్‌బోర్టులో.. రాష్ట్రంలోని అన్ని 108 వాహనాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు చూపించడంలో మతలబు ఏంటి? చాలా చోట్ల వాహనాలే లేవు. ఎన్నో చోట్ల మూలనపడ్డాయి.ఏ ఒక్క వాహనానికీ చిన్న రిపేరు కూడా చేయించడం లేదు.. అయినప్పటికీ మొత్తం అన్ని వాహనాలూ పనిచేస్తున్నట్లుగా చూపిస్తూ.. ఒక్కో వాహనానికి నిర్వహణ నిమిత్తం నెలకు రూ.లక్షా ముప్పై వేలు చెల్లించడం నిజం కాదా? కోట్లాది రూపాయల ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నట్టు? అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే 108 లాంటి మహోన్నత వ్యవస్థను సైతం.. అవినీతికి వాడుకుంటున్న మిమ్మల్ని ఏమనాలి?  

-వైయ‌స్‌ జగన్   

Back to Top