తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల హత్యయత్నం ఘటనపై వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆఫీస్ ఇంచార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం చుట్టూ గుండాలు, అసాంఘిక శక్తులు దాడికి దిగడం అత్యంత ఆందోళనకర పరిణామమని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి కుట్ర పన్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాకుండా, రాజకీయ ప్రేరేపిత హింసకు పరాకాష్ట అని స్పష్టం చేశారు. మాజీ మంత్రికే భద్రత లేకుండా ఉన్న పరిస్థితి, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను వెల్లడిస్తున్నదని గుర్తు చేశారు. గుండాలు, రౌడీలను ప్రోత్సహిస్తూ దాడులకు పాల్పడుతున్న శక్తుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసుల యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ నిర్వీర్యతకు, పాలన వైఫల్యానికి అద్దం పడుతోందని లేఖలో పేర్కొన్నారు.