తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్‌గా మారిపోయిందని వైయస్ జగన్ మండిపడ్డారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులకు దిగుతున్నారని, తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో చంద్రబాబు చేసిన కుట్ర విఫలమవడంతో భంగపడి వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు ఉదయం అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని వైయస్ జగన్ పేర్కొన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్లుగా ప్రవర్తించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు NDDB, NDRI వంటి ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయని వైయస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరచినందుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి కూడా, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా, భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు వంటి వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేయించారని, చివరకు అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయించడం చంద్రబాబు నియంత స్వభావానికి నిదర్శనమని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వరుసగా వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల వైపు నెడుతున్నాయని పేర్కొన్న వైయస్ జగన్, రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దాడులను అడ్డుకోవడంలో విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ తదితర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబటి రాంబాబుతో పాటు వైయస్‌ఆర్‌సీపీ నాయకులందరికీ తగిన భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు (HMOIndia) విజ్ఞప్తి చేస్తున్నట్లు వైయస్ జగన్ తెలిపారు. ఈ అంశంపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారని ఆయన వెల్లడించారు.