ఆ పసితల్లి దుఃఖం మనసును మెలిపెట్టినట్టనిపించింది


 

26–05–2018, శనివారం 
జక్కరం, పశ్చిమ గోదావరి జిల్లా.

గుళ్లో దీపాలు వెలిగించే మా జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయని మధ్యాహ్నం శిబిరం వద్ద కలిసిన అర్చకులు, దేవాలయ సిబ్బంది తమ దుర్భర జీవన స్థితిగతులను వివరించారు. దేవాలయాల ఆదాయాలే తమ జీతాలను, జీవితాలను నిర్ణయిస్తున్నాయని, ఆలయాల ఆదాయంలో 30 శాతం తమ జీతభత్యాలకు వాడాలన్న నిబంధన ఉండటంతో ఆదాయం తక్కువున్న గుళ్లలో పనిచేసేవారి బతుకులు భారంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకవైపు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులంటూ ముద్ర వేసి రేషన్, ఆరోగ్యశ్రీలాంటి ఏ పథకాలు వర్తింపజేయరు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పెన్షన్లు, పీఎఫ్‌లు, వేతనాలు, హెల్త్‌ స్కీముల్లాంటి సదుపాయాలూ కల్పించరు.

రెంటికీ చెడ్డ రేవడి మా బతుకులు’అంటూ వాపోయారు. ‘అన్ని దేవాలయాల నుంచి వచ్చే 30 శాతం నిధులతో జీతభత్యాల నిధిని ఏర్పాటుచేసి మా జీవితాలను మార్చాలని మీ నాన్నగారు సంకల్పించారు. అందుకు అవసరమైన చట్ట సవరణ చేసి జీవోలను విడుదల చేశారు. ఆయన మరణం మాకు అశనిపాతమైంది. ఆ తర్వాత పాలకులెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ‘ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత’లా తయారైన మా స్థితిగతుల్ని మీరే మార్చగలరన్న నమ్మకం మాకుంది’అంటూ వారు విశ్వాసం వ్యక్తం చేశారు. దేవాలయమైనా, మసీదైనా, చర్చి అయినా, ధర్మాన్ని రక్షించే ఏ ప్రార్థనాలయంలోనైనా సేవలందించే సిబ్బందిని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.  


‘అన్నా.. నా ఆశలు, ఆశయాలు కలలుగానే మిగిలిపోవాల్సిందేనా? కల్లలై పోవాల్సిందేనా? బాగా చదువుకోవాలన్న కసి ఉంది.. డాక్టరై అమ్మానాన్నలను బాగా చూసుకోవాలన్న తపనా ఉంది. కానీ, మద్యం మా కుటుంబాన్ని నాశనం చేస్తోంది’అంటూ కాళ్ల గ్రామంలో కళ్ల నిండా నీళ్లతో నన్ను కలిసిన ఓ చిట్టితల్లి మాటలు నా గుండెను పిండేశాయి. ‘తండ్రిని ప్రేమించాల్సిన మేమే ఆయనను చూసి బాధపడుతున్నాం.. భయపడుతున్నాం. ఇంట్లో నాన్న ప్రేమ లేదు.. బయట గౌరవమూ లేదు. బాగా చదివించి భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని తపించాల్సిన కన్నతండ్రే పచ్చి తాగుబోతై రోడ్ల మీద పడిపోతుంటే.. మా జీవితాలు ఏమైపోవాలి?’అని ఆ ఆడబిడ్డ బాధపడుతుంటే.. మానవ సంబంధాల్ని, కుటుంబ బాంధవ్యాల్ని మద్యం ఎంతలా ఛిద్రం చేస్తుందో తెలుస్తోంది.

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే మద్యానికి బానిసై, తాగినప్పుడు మృగమై కట్టుకున్న భార్యను, ఒక్కగానొక్క ఆడబిడ్డను రాచిరంపాన పెడుతుంటే మద్యమనే వ్యసనం మనిషిని ఎంతగా దిగజారుస్తుందో అవగతమవుతోంది. ‘కూలి పనికి వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుని మా అమ్మ తెచ్చే కాసిన్ని డబ్బుల్ని నాన్న మద్యానికి తగలేస్తుంటే.. ఎందుకీ బతుకు అనిపిస్తోంది’అన్న ఆ పసితల్లి దుఃఖం మనసును మెలిపెట్టినట్టనిపించింది. ‘అన్నా మాకే సాయమూ అక్కర్లేదు.. మద్యం షాపుల్ని మూసేయించండి.. మాలాంటివారి జీవితాల్లో వెలుగులు పంచండి’అంటూ వేడుకుం టున్న తీరులో.. వేదనంతా ముఖంపై కనిపిస్తుంటే.. మద్యం రక్కసిని తరిమేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ‘నేనూ, మా అమ్మ ఏ పాపం చేశాం? ఎందుకు మాకీ శిక్ష?’ అంటూ పొంగిపొర్లే కన్నీటితో సంధించిన ఆ ఆడ కూతురి ప్రశ్నలకు.. ప్రజల జీవితాలు నాశనమైపోయినా పర్లేదు.. మద్యం ప్రధాన ఆదాయం.. దాని మీద వచ్చే ముడుపులే ముఖ్యమని భావిం చే ముఖ్యమంత్రిగారే సమాధానం చెప్పాలి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పుష్కర పనుల్లో విచ్చలవిడి అవినీతి మీ పాలనలోనే కాదా? సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములను మీ ఇష్టమొచ్చినవారికి, ఇష్టమొచ్చిన ధరకే కట్టబెట్టే దురాలోచన, దుష్ట చర్యలు మీవి కావా? కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలోని పీర్ల గుడిలో గుప్త నిధుల కోసం జరుగుతున్న తవ్వకాల వెనుక మీ ఆదేశాలు లేవనగలరా? మీ హయాంలోనే దుర్గమ్మ ఆభరణాలు మాయమవడం నిజం కాదా? చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మీ పాలనలోనే ప్రసిద్ధ దేవాలయాల్లో తాంత్రిక పూజలు, తిరుమల వెంకన్న సన్నిధిలో నిరసనలులాంటి అపచారాలు జరగడం వాస్తవం కాదా? దైవభక్తి, పాపభీతి లేని మీలాంటివారి పాలనలోఅర్చకులు, ఆలయ సిబ్బంది జీవితాల బాగు ఆశించగలమా?
-వైయ‌స్‌ జగన్‌
Back to Top