40 ఏళ్ల ఇండస్ట్రీ దేనికి ఉపయోగపడింది

నెల్లూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను
సాధించడంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు చేజార్చుకున్నారని వైయస్‌ఆర్‌
కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేసిన ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.  హోదా కోసం పదవులను కూడా లెక్క చేయకుండా పార్టీ
అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఐదుగురం ఎంపీలం రాజీనామాలు చేసి ఆమరణ
దీక్షకు కూర్చున్నామని గుర్తు చేశారు. నెల్లూరులో జరుగుతున్న వంచన పై గర్జన దీక్ష
వేదికపై వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇదే నెల్లూరులో జరిగిన ప్రజా
సంకల్పయాత్ర చేస్తున్న సమయంలోనే వైయస్‌ జగన్‌ ఎంపీల రాజీనామాలపై స్పష్టమైన ప్రకటన
చేసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. విభజన అంశాలు, ప్రత్యేక హోదా విషయాల్లో కేంద్ర
ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే.. చంద్రబాబు రెండవ ముద్దాయన్నారు. హోదా సాధనలో
కీలకమైన నాలుగు అవకాశాలు  చంద్రబాబు ఏ
విధంగా చేజార్చుకున్నారో.. వైయస్‌ అవినాష్‌రెడ్డి వివరించారు. 

మొదటి అంశం.. 

యూపీఏ క్యాబినెట్‌ ఏపీకి 5 సంవత్సరాల పాటు  హోదా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్‌ కమీషన్‌కు సిఫార్సు
చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 8 నెలల పాటు నిర్ణయం అలాగే ఉంది. ఈ
మధ్యలో ఆయన ఢిల్లీకి వెళ్లి హోదా అమలు చేయండి అని అడిగిన పాపాన పోలేదు. 

రెండవ అంశం.. 

2016 సెప్టెంబర్‌లో అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పినప్పుడు
మేం ఒప్పుకోం.. తిరుపతి సభలో 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఇచ్చిన
హామీకి కట్టుబడి, ఆ ప్రకారమే 10 ఏళ్లు హోదా ఇస్తేనే  ఒప్పుకుంటామని చంద్రబాబు ఎదురుతిరిగి ఉంటే
ప్రత్యేక హోదా వచ్చేది. కానీ ఆ పని చేయకపోగా.. శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. 

మూడవ అంశం

రాజధాని శంకుస్థాపనకు మోడీ అమరావతికి
వచ్చారు. అదే సమయంలో గుంటూరు కేంద్రంగా వైయస్‌ జగన్‌ నిరాహార దీక్ష చేశారు.
ఎనిమిదో రోజు బలవంతంగా పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేశారు. మరుసటి రోజే
చంద్రబాబు రాజధానికి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షనేత హోదా కోసం ఆమరణ దీక్ష
చేస్తున్నారు.. ఇబ్బందులు ఎదురవుతాయి.. శంకుస్థాపకు వచ్చినప్పుడు హోదాను
ప్రకటించండి అని కనీసం కోరాల్సింది. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. 

నాల్గవ అంశం..

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా
కోసం రాజీనామాలు చేసే సమయంలో వైయస్‌ జగన్‌ అనేక బహిరంగ సభల్లో ఒకే మాట అడిగారు.
రాజకీయాలు ఎన్నికలప్పుడు చూసుకుందాం. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుందాం.. మీ
ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి నిరాహార దీక్షలు చేస్తే దేశం అంతా మనవైపు
చూస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడదాం.. అప్పుడు హోదా విషయంలో స్పష్టత
ఇస్తారని వైయస్‌ జగన్‌ అనేక సార్లు కోరారు. అయినా చంద్రబాబు ముందుకు రాలేదు. 

 ఇవన్నీ చాలవన్నట్లుగా ఇప్పుడు మళ్లీ
ధర్మపోరాట దీక్షలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్‌ పౌరుడిగా
అడుగుతున్నా.. 40 సంవత్సరాల అనుభవం ఏ విషయంలో ఉపయోగపడిందో చెప్పాలి. రాష్ట్రానికి
ద్రోహం చేయడానికి ఉపయోగపడింది. చంద్రబాబు ఎప్పుడు మైక్‌ పట్టుకున్నా.. 40 ఏళ్ల అనుభవం..
నాలుగేళ్లుగా 29 సార్లు ఢిల్లీకి వెళ్లాను అని చెబుతారు. ఏ పత్రిక, ఏ ఛానల్‌ చూసినా
చంద్రబాబు ఎందుకు నియోజకవర్గాల పెంపుకు. ఏ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి
అడగలేదు. కేవలం 50 ఎమ్మెల్యేల స్థానాల పెంపుకు మాత్రమే కేంద్రంతో మాట్లాడారు తప్ప
చేసిందేమీలేదు. మీ అనుభవం, మీ పర్యటనలు రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. 

 ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశాం.
29వ తేదీన ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని
గట్టిగా చెప్పాం. మొదటి వారంలో రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు
అనివార్యం అయితే బీజేపీ, టీడీపీకి దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వాలి. హోదా సాధించాలన్నా, ఉక్కు పరిశ్రమ, రైల్వేజోన్, దుగ్గరాజుపట్నం
పోర్టు సాధించాలంటే వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని
బలపర్చాలని అవినాష్ రెడ్డి ప్రజలను కోరారు. 

Back to Top