చంద్రబాబు కుట్రలో భాగస్వామి కాదలచుకోలేదు

చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి  సంబంధించి సీనియర్‌ నాయకులతో పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చర్చించారు.అనంతరం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం చంద్రబాబు గారు చేసే మరో కుట్రలో వైయస్ ఆర్ సీపీ  భాగస్వామి కావడం లేదు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి పొద్దుపోయాక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

అందులోని ముఖ్యాంశాలు :
 
ప్రత్యేక హోదాకోసం పూటకో మాట, రోజుకో వేషం వేసే చంద్రబాబు నాయుడుగారు – ఇవాళ రాజకీయపార్టీలను, అఖిల సంఘాలను ఆహ్వానించడం ఏంటి? ఏ నైతికతా లేని ఆయన పిలవటం ఏమిటి? మేం వెళ్ళటం ఏమిటి? 
అసలు ఆయనమీద నమ్మకం ఎలాపెట్టుకుంటాం?  ప్రత్యేక హోదా ఉసురుతీయడానికి శతవిధాలా ప్రయత్నించిన ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఇప్పుడు హోదా ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏంటి? పెద్దమనిషిగా వ్యవహరించడం ఏంటి? 
చంద్రబాబుగారు చేసే మరో కుట్రలో మేం భాగస్వాములం కాదలుచుకోలేదు. 

సెప్టెంబరు 8, 2016న ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ, ఒక అబద్దపు ప్యాకేజీపై అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. మొన్న టీడీపీ ఎంపీలు కేంద్ర కేబినెట్‌నుంచి వైదొలుగుతున్నప్పుడు మళ్లీ అదే ప్రకటనను అరుణ్‌జైట్లీ పునరుద్ఘాటించారు. రెండూ ఒకటే రకమైన ప్రకటనలు అయినప్పుడు – సెప్టెంబరు 8, 2016న చంద్రబాబుగారు ఎందుకు ఆ ప్రకటనను వ్యతిరేకించలేదు? 

మొదటసారి జైట్లీ స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు చంద్రబాబుగారు చప్పట్లు కొట్టలేదా? బ్రహ్మాండంగా ఉందని పొగడలేదా? 
అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం పెట్టి కేంద్రంపై ప్రశంసలు కురిపించలేదా?

అసలు ప్రత్యేక హోదామీద ఏ పోరాటం చేస్తే.. ఆపోరాటాన్ని నాలుగేళ్లుగా చంద్రబాబుగారు నీరుగార్చలేదా?
బంద్‌లు, ధర్నాలను అడ్డుకోలేదా? ఈ ఆందోళనలను దగ్గరుండి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించలేదా? 

విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానిరి యువభేరులు నిర్వహిస్తే... పిల్లలపై పీడీ యాక్ట్‌ పెడతామని బెదిరించలేదా?
నిరాహారదీక్షలు చేస్తే.. శిబిరాన్ని ఎత్తివేయలేదా?

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చేరోజుకంటే ముందు అంటే ఈనెల మార్చి 15న చంద్రబాబు గారు అసెంబ్లీలో చేసిన ప్రకటనను మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సంఖ్యాబలం ఉంటే.. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. ఆ తర్వాత రోజే అంటే ఈనెల మార్చి 16న ఉదయం 9 గంటలవరకూ ఎన్డీయేలో కొనసాగి... ఆతర్వాతే.. వెంటనే తమకు తాముగా అవిశ్వాసం పెడతామని చెప్పలేదా?

మా పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ... దేశంలోని ప్రతిపార్టీకి లేఖలు రాసి... ఆయాపార్టీలను ఒప్పించి కార్యాచరణలోకి దించారు. ఆ విషయం తెలిశాక అప్పుడు  చంద్రబాబు.. క్రెడిట్‌ కోసం తనుకు తానుగా అవిశ్వాసం పెడతామని ప్లేటు ఫిరాయించారు. 

ముందు రోజు మద్దతు ఇస్తామన్నారు, రెండో రోజు– మాట మార్చారు. 
ఈరకంగా పూటకో మాట, రోజుకో స్టేట్‌మెంట్‌ ఇచ్చే చంద్రబాబుగారు ఇప్పుడు పెద్దరికం వహించడం ఏంటి?
పార్టీలను పిలిచినంత మాత్రాన ఇప్పుడు మంచోడివి అయిపోయావని మేంగానీ, ప్రజలుగానీ ఎందుకు నమ్మాలి? 
చంద్రబాబుగారు పన్నుతున్న మరో కుట్రలో మేం భాగస్వాములం కాలేం. 

ఆయన చిత్తశుద్ధిమీద మాకు నమ్మకంలేదు. 
ప్రత్యేక హోదా సాధన పోరాటానికి సంబంధించి ఇప్పటికే మేం కార్యాచరణ  ప్రకటించాం. 

మా ఎంపీలు రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. టీడీపికి చెందిన ఎంపీలచేత కూడా రాజీనామాలు చేయించండి. ఎంపీలంతా ఒక్కతాటిపైకి వచ్చి రాజీనామాలు చేస్తే దేశానికి సరైన సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. 

ఎంపీల రాజీనామాలకు సంబంధించి ఇప్పటికే మేం పిలుపునిచ్చాం. ఆ కార్యక్రమంలో చంద్రబాబు, ఆయన పార్టీ ఎంపీలు భాగస్వాములయ్యే విధంగా అడుగులు ముందుకు వేయాలి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
Back to Top