స్థానిక ఎన్నికల్లో మనదే గెలుపు

తిరుపతి, 14 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నగారాను మోగించింది. తిరుపతి నగరం  శుక్రవారం నాడు దీనికి వేదికైంది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు  రాజకీయాలను సమర్థంగా ఢీకొట్టాలని గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్.విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే కీలకమన్నారు. సదస్సుకు రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా నుంచి తరలి వచ్చిన నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలలో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడకుండా చూడాలని ఆమె సూచించారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక ప్రతి ఎన్నికల్లోనూ పార్టీదే విజయమన్నారు.

పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు సాగుతున్నాయని  విజయమ్మ ఆరోపించారు. ఆ రెండు పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ సత్తా ఏంటో చూపేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అవకాశమన్నారు. తొలుత శ్రీమతి విజయమ్మ సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన  దివంగత మహానేత డాక్టర్  వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Back to Top