హోదా కోసం వందసార్లైనా బల్లలు ఎక్కుతాం

  • ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
  • బాబు, వెంకయ్యలు ఐదుకోట్ల ఆంధ్రులను మోసం చేశారు
  • హోదా రాదేమోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు 
  • ప్రత్యేకహోదా కోసం ప్రజల గొంతుక వినిపించడమే తమ తప్పా..?
  • పచ్చకండువాలు కప్పిన బాబుపై చర్యలెందుకు తీసుకోరు..?
  • ప్రాణాలు పోయినా సరే హోదా కోసం మా పోరాటం ఆగదు
  • విలేకరుల సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ః ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు, ఆర్కే, కంబాల జోగులు, డా.సునీల్ కుమార్, కె.సంజీవయ్యలు మీడియాతో మాట్లాడారు.  ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు, 15 ఏళ్లు కావాలని చెప్పిన  చంద్రబాబు, వెంకయ్యనాయుడులు.... కేంద్రం హోదా లేదు ప్రత్యేకప్యాకేజీ లేదు ఇచ్చిందే తీసుకోవాలని చెబితే, నిస్సిగ్గుగా మేం దాన్ని స్వాగతిస్తున్నామని బాబు శాసనసభకు వచ్చిన సమయంలో చెప్పడం దుర్మార్గమన్నారు. ఐదున్నర కోట్ల ఆంధ్రులను బాబు పూర్తిగా అవమానపర్చిన దశలో...బాబు, వెంకయ్యలు మోసం చేశారని వైయస్సార్సీపీతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు బాధపడుతున్న సమయంలో...శాసనసభ వేదికగా ప్రజల గొంతును వినిపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరితే, వాయిదా తీర్మానం అడిగితే చర్చకు అనుమతించకుండా నిర్దాక్షిణంగా తమను పక్కకు తోసేశారని వాపోయారు. మా నేతకు సెకన్ కూడా మైక్ ఇవ్వకుండా నిర్దాక్షిణంగా గొంతు నొక్కారని ఆవేదన వెలిబుచ్చారు.

ఎమ్మెల్యేల హక్కులు కాపాడానికి ప్రివిలేజ్ కమిటీ ఉంటుందని, కానీ తమనే కమిటీ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులివ్వడం బాధాకరమన్నారు. ఫ్యాన్ గుర్తుపై వైయస్ఆర్ దీవెల మీద జగన్ అండతో గెలిచిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను.... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బాబు పచ్చకండువాలు కప్పిన సంఘటన మీద తాము నోటీసులు జారీ చేస్తే ఈరోజు వరకు ఏకమిటీలో పట్టించుకోలేదని ఆర్కే ఆవేదన చెందారు. ప్రజల బాణి వినిపించేవారిని అణచివేసేందుకు ప్రభుత్వం శాసనసభను వేదికగా మల్చుకోవడం దురదృష్టకరమన్నారు. .రాబోయే రోజుల్లోనైనా చేసిన తప్పులను తెలుసుకొని బాబు, వెంకయ్యలు హోదా తేకపోతే వందసార్లైనా బల్లలు ఎక్కుతామన్నారు. . సభలో ప్రజల గొంతు వినిపించేందుకు మా అధినేతకు మైక్ ఇవ్వకపోతే వేయి సార్లైనా మైక్ లాగేస్తానని అన్నారు. రెండు సార్లు అసెంబ్లీలో హోదాపై ఏకగ్రీవ తీర్మానం చేసిన బాబు నిస్సిగ్గుగా దాన్ని పక్కన పడేసి.... ఇచ్చింది తీసుకోండి అన్న చందాన కేంద్ర ప్రకటనను స్వాగతిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు.  ప్రాణాలు పోయినా సరే పోరాటం చేసి ప్రత్యేకహోదాను సాధించితీరుతామన్నారు. ప్రజల పక్షాన ఉద్యమించేందుకు వైయస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  



ప్రత్యేకహోదాను కాదని ముఖ్యమంత్రి ప్యాకేజీని స్వాగతించిన ఘటన మీద యావత్ రాష్ట్ర ప్రజానీక ఆందోళన చెందిందని, హోదా రాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ప్రత్యేకహోదాపై చర్చకు తాము సిద్ధపడితే ప్రభుత్వం పారిపోవడం వల్లే సభను స్తంభింపజేసేందుకు బల్లలు ఎక్కామనివారు స్పష్టం చేశారు. హోదా కోసం ఏ త్యాగానికైనా తాము సిద్ధమని అన్నారు.   తమ హక్కులకు భంగం వాటిల్లితే ప్రివిలేజ్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో..తమనే దోషులుగా ప్రభుత్వం చిత్రీకరించడం బాధాకరమన్నారు. ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉపాధి లభిస్తుందని ప్రజలు భావిస్తున్నదున వారి గొంతుక వినిపించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తమపై ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. అవసరమైతే ఎంపీలతో రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్తామని తమ నాయకుడు వైయస్ జగన్ ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా విషయంలో పోరాడేందుకు  మా నాయకుడు, పార్టీ సభ్యులమంతా సిద్దంగా ఉన్నామని, తమకు ప్రజలు అండగా ఉన్నారని తెలియజేశారు. ప్రజల హక్కును కాదనే ధైర్యం బాబుకు ఎవరిచ్చారని, ఏకపక్షంగా ప్యాకేజీని ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రాజీపడినప్పుడే బాబు దిగజారుడుతనం బయటపడిందన్నారు. కనీసం ఇప్పటికైనా నైతికను బయటపెట్టుకోవాలని, ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో మాట్లాడేందుకు ముందుకు రావాలని ప్రభుత్వానికి హితవు పలికారు.  


Back to Top