విభజనపై సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తాం

హైదరాబాద్, 5 అక్టోబర్ 2013: 

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ.. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకున్న నిర్ణయంపై తప్పకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళి, న్యాయపరంగా పోరాటం చేస్తామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన అన్ని అంశాలను తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం ఇలా నిరంకుశంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. సమస్యలపై మంత్రుల బృందా (జిఒఎం)నికి ఆరు వారాలే సమయం ఇస్తే.. ఏ విధంగా పరిష్కరించగలుగుతుందని ప్రశ్నించారు. అధికారం తన చేతిలో ఉంది కదా అని కేంద్రం నిరంకుశంగా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గాలికి వదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోడోలాండ్, గూర్ఖాలాండ్, ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసిన విదర్భ గురించి పట్టించుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే విభజించడంలోని ఔచిత్యాన్ని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించే విధానం ఇదేనా అని నిలదీశారు.

సమైక్యాంధ్రకు తాను కట్టుబడి ఉన్నానంటూ చంద్రబాబు నాయుడు వెంటనే కేంద్రానికి లేఖ ఇవ్వాలని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‌ఢిల్లీలో తాను చేపట్టే నిరాహార దీక్షకు ముందే చంద్రబాబు ఆ పని చేయాలని శ్రీ జగన్‌ డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్ర డిమాండ్‌తో చంద్రబాబు నాయుడు లేఖ ఎందుకు ఇవ్వటంలేదో మీడియా ఆయననే అడగాలని శ్రీ జగన్ సూచించారు.

‌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై అధ్యయనం చేయడానికి పది మంది కేంద్ర మంత్రులతో బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం, నదీ జలాలు, ఆస్తుల పంపకం తదితర అంశాలపై ఈ బృందం సిఫారసులు చేయాల్సి ఉంటుంది. ఈ మంత్రుల బృందంనిలో హోం, ఆర్థిక, న్యాయ, జల వనరుల మంత్రులు కూడా ఉంటారు. ఆరు వారాల్లో ఈ బృందం సిఫారసులు సమర్పించాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Back to Top