ఉత్తరాఖండ్‌లో అందరికంటే ముందే సేవలందించాం

హైదరాబాద్ 29 జూన్ 2013:

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంకూడా పట్టించుకోని పరిస్థితిలో తమ వైద్య బృందం మొట్టమొదటిసారి వైద్య సేవలందించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్సు సెల్ కన్వీనర్ డాక్టర్ శివభరత్ రెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మసూచనల మేరకు వరద బాధిత చార్ ధామ్ ప్రాంతంలో ఇరవై మందితో కూడిన వైద్య బృందం ఈనెల 19నుంచి వైద్య సేవలను అందించినట్లు  చెప్పారు. శనివారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బృందంలో ఆరుగురు పూర్తిస్థాయి వైద్యులు మిగిలిన వారు పారా మెడికల్ సిబ్బందని వివరించారు. పది లక్షల రూపాయల విలువైన మందులను తీసుకెళ్ళామన్నారు. హరిద్వార్ ప్రాంతంలో తాము 25 మృతదేహాలను గమనించామన్నారు. వారంతా తెలుగువారన్నారు. వారి బంధువులకు ఫోను చేసి విషయాన్ని వివరించామన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చడానికి సాయపడ్డామన్నారు. తదుపరి అనేక ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. హృషీకేశ్, జాలిగ్రామ్, డెహ్రాడూన్, తదితర ప్రాంతాలలో వీటిని ఏర్పాటుచేసి బాధితులకు చికిత్సలు అందించామన్నారు. మాతో పాటు ఉన్న ఇద్దరు వైద్యులు కేదార్‌నాథ్, తదితర ప్రాంతాలకు హెలికాప్టర్లో వెళ్ళి చికిత్సలు చేశారన్నారు. వరద ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. అక్కడ ఉన్న మిలటరీ వారు ఎంతో కష్టపడింది. మేము ధరించిన టీషర్టులపై ఉన్న లోగోలలో తెలుగును చూసి ఎంతోమంది తమను గుర్తించి తమను ఆదుకోవాలని కోరారన్నారు. వైద్య సాయంతో పాటు వారి బంధువులకు సమాచారం అందించడానికి కూడా తాము ఉపయోగపడ్డామన్నారు. దగ్గరుండి వారికి సాయపడ్డామని భరత్ రెడ్డి చెప్పారు. తమ వైద్య విభాగం ఇలాంటి వైద్య కార్యక్రమాలను ఎప్పటినుంచో చేస్తున్నామన్నారు. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్య కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమన్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ నినాదంతోనే తమ విభాగం పనిచేస్తోందన్నారు. ఈరోజే తాము తిరిగొచ్చామన్నారు. అక్కడి అధికారులు తమకెంతో సాయపడ్డారని చెప్పారు. రాష్ట్రపతి కూడా తమ సేవలను అభినందించిందన్నారు. ప్రచారం కోసం కాక సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాము పనిచేశామన్నారు. సత్తెనపల్లికి చెందిన డాక్టర్ నాగభూషణ రెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలందించిన తొలి బృందం తమదేనని తెలిపారు. మందుల కంటే ముందు మానసిక స్థైర్యాన్ని కల్పించామన్నారు. 2500 మందికి తాము చికిత్స అందించామన్నారు. కట్టుబట్టలతో మిగిలిన వారికి స్థానిక అధికారులతో మాట్లాడి సాయపడగలిగామన్నారు. హృషికేశ్ లోని ఆంధ్ర ఆశ్రమం వారు తెలుగువారిని అక్కడికి చేర్చారనీ, వారందరకీ వైద్యం చేశామన్నారు. తాము చేసిన సేవ ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ అశోక్ మాట్లాడుతూ తెలుగు వారికి ఎలా సాయపడాలి.. ఎలా వైద్యమందించాలి అనే విషయమై డాక్టర్ పురుషోత్తం సాయంతో పనిచేశామన్నారు. నంద్యాలకు చెందిన నాగపురుషోత్తమ రెడ్డి, డాక్టర్ ఫణి కూడా ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాఖండ్ మృతులకు ఈ బృందం రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించింది.

Back to Top