వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్నేర్జాంపల్లి ( వైయస్ఆర్ జిల్లా) 23 అక్టోబర్ 2012 : జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందనీ,  రైతు పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారనీ షర్మిల భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్నది రైతన్నలేననీ, వారి సంక్షేమమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమనీ ఆమె అన్నారు. జగనన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తారని షర్మిల హామీ ఇచ్చారు.
ఐదవ రోజు సోమవారం మరో ప్రజాప్రస్థానం లో భాగంగా పలు చోట్ల ప్రజలు షర్మిలకు తమ సమస్యలు చెప్పుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అమలయ్యే ప్రణాళికలను వివరించారు. సాగునీటి కష్టాలను తీర్చేందుకు వైయస్సార్ సీపీ కృషి చేస్తుందన్నారు.
ఆదివారం రాత్రి బస చేసిన లింగాల ఐటీఐ నుంచి సోమవారం ఉదయం 10.30కు షర్మిల యాత్ర ప్రారంభించారు. సుమారు 17 కి.మీలు నడిచారు. వడివడిగా నడుస్తూనే జనంతో మాట్లాడుతూ సాగారు. కాంగ్రెస్, టిడిపిల కుమ్మక్కు రాజకీయాలకు ఎన్నో నిదర్శనాలున్నాయని ఆమె అన్నారు. జగనన్న మీద కేసులుంటాయి కానీ, కానీ బాబు తన మీద ఎంక్వైరీ జరుగకుండా చీకట్లో చిదంబరాన్ని కలుసుకుని చేతులు కలుపుతారని ఆమె విమర్శించారు. ముందుముందు తప్పక మంచి రోజులు వస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
షర్మిల బస చేసిన చోటికి దగ్గరలోని మండలాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. అనంతపురం నుంచి కూడా మహిళలు తరలివచ్చి షర్మిలను కలుసుకున్నారు. షర్మిల లింగాల దాటాక రోడ్డు మీద జనం ఆమెను కలిసి వర్షాలు లేవు. నీళ్లు లేవు. పంటలు లేవు. పనులు లేవు-అని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడ ఓ బాలుడు కనిపించడంతో స్కూలుకు వెళుతున్నావా చిన్నా అంటూ షర్మిల అడిగారు. బతకడానికి ఏం మిగిలిందమ్మా.. పనిచేయకుంటే పూట గడవదు- అని అనడంతో షర్మిల చలించిపోయారు. 'జగనన్న సీఎం కాగానే అందరికీ చదువు ఉచితంగా చెప్పిస్తాడు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాడు' అని ధైర్యం చెప్పారు.
షర్మిల మధ్యాహ్నం 12.20కి కర్ణపాపయ్యపల్లికి చేరుకున్నారు. అక్కడ సౌజన్య అనే విద్యార్థిని మాట్లాడుతూ రాజన్న ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా వివరిస్తూ ప్రసంగించింది. ఒక వృద్ధురాలితో షర్మిల మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా ముద్దాడారు. అక్కడ మహిళలు భారీ సంఖ్యలో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రైతులు కరెంటు ఉండడం లేదని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని జనం షర్మిలకు ఫిర్యాదు చేశారు. మనిషి ప్రాణం పోయే స్థితిలో ఉన్నా 108 పలకడం లేదన్నారు. తన ఇద్దరు పిల్లలకు రాజశేఖరరెడ్డి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టాడని ఓ నేత కార్మికుడు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేత గిట్టుబాటు కాక మగ్గం అమ్మేసి కూలికి వెళుతున్నానని, వర్షాలు లేక కూలి పనికూడా దొరకడం లేదని వాపోయాడు.
షర్మిల ఇరవై రోజులు ముందొస్తే బాగుండేదని, అప్పుడే వర్షం కురిసి తమ పంటలు నిలబడేవని మరో రైతు ఆదివారం కురిసిన వర్షానికి హర్షం వెలిబుచ్చాడు. ప్రజల బాధలకు షర్మిల స్పందిస్తూ, డబ్బున్నోళ్లు, రాజకీయ నాయకులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకోరు. ఎందుకంటే అక్కడ మంచి వైద్యం లభించే పరిస్థితి లేదు కాబట్టి. వాళ్లంతా కార్పొరేట్ ఆసుపత్రుల్లో, అవసరమైతే విదేశాల్లో చికిత్స చేయించుకుంటారు. డబ్బు లేని కారణంగా ఒక్క పేదవాడు కూడా ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఒక డాక్టర్‌గా రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని ఏర్పాటుచేశారు. అలాగే పేదవాళ్ల పిల్లలు ఒక డాక్టరో, ఒక ఇంజనీరో అయితే ఆ కుటుంబం బాగుపడుతుందని, డబ్బు లేని కారణంగా ఏ పేదవాడూ కూడా చదువుకోలేని పరిస్థితి ఉండకూడదనిఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఏర్పాటుచేశారు- అని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఆ పథకాలన్నింటికీ తూట్లు పొడిచిందని, చంద్రబాబు ప్రభుత్వానికి ఏమీ తీసిపోలేదని షర్మిల దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారని ఆమె గుర్తు చేశారు. విద్యుత్తు బకాయిలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె చెప్పారు.రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ఆమె బాబును నిలదీశారు. నిజానికి కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
వెలిదండ్ల సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు భోజన విరామం ముగిసాక తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యలో ఉన్న లింగాల కుడికాలువను షర్మిల పరిశీలించారు. లింగాల బ్రాంచ్ కెనాల్ కు వైఎస్ హయాంలో 80 శాతం పనులు పూర్తయినా.. ఈ మూడేళ్లలో ఆ 20 శాతం కూడా పూర్తికాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి నుంచి సాయంత్రం 4.35కు వెలిదండ్లకు చేరుకున్నారు. అక్కడ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందిన పలువురు సభలో ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నానని ఒకరు, ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని మరొకరు తెలిపారు. ట్రాక్టర్‌పైకి ఎక్కి షర్మిల మాట్లాడుతూ తండ్రి వైయస్ లాగే నమస్తే అక్కా, నమస్తే అన్నా, నమస్తే పెద్దమ్మా, నమస్తే పెద్దయ్యా.. అంటూ ఆత్మీయంగా పలకరించారు.
రాజన్న ఉంటే...
ట్రాక్టర్‌పై నుంచి షర్మిల మాట్లాడుతూ.. రాజన్న ఏడు గంటలు కరెంటు ఉచితంగా ఇస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. రాజన్న ఉంటే 9 గంటలు కరెంటు ఇచ్చి ఉండేవారని చెప్పారు. కరెంటు బిల్లులు కట్టలేక, అనేక సమస్యలతో చంద్రబాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర పేరుతో ఎల్లో డ్రామా ఆడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎగతాళి చేశారు. ఆయన హయాంలో ఆత్మహత్యలదే రికార్డు అని విమర్శించారు. అక్కడి నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగగా దంతెలపల్లి నుంచి మహిళలు భారీ సంఖ్యలో ఎదురేగి స్వాగతం పలికారు. కడప నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులు పూల తివాచీ పరిచి సంఘీభావం తెలిపారు. మార్గం మధ్యలో వేరుశనగ రైతు ఒకరు కలిసి.. కాత కాయలేదని, మూడు ఎకరాల్లో పెట్టిన రూ.20 వేల పెట్టుబడి నేల పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు రూ. 300 చొప్పున మాత్రమే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారని వివరించారు. బ్యాంకు నుంచి తెచ్చిన రూ. 25 వేల అప్పు అలాగే ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడి నుంచి నడుస్తుండగా కొట్యాల గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. తర్వాత అనంతపురం జిల్లా పరిధిలోని నేర్జాంపల్లిలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. ఐదో రోజు మొత్తం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఉదయం కొంతసేపు, సాయంత్రం కొంతసేపు వైఎస్ విజయమ్మ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో సాగిన యాత్ర మంగళవారం అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తోంది. అనంతపురం జిల్లాలో 15 రోజుల పాటు సుమారు 200 కి.మీ మేరకు యాత్ర పాదయాత్ర కొనసాగుతుంది. 75 గ్రామాలలో సాగనున్న ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంత పురం వేయికళ్లతో షర్మిల కోసం ఎదురుచూస్తోందని కోటింరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top