విజయమ్మతో ప్రవీణ్, అమర్నాథరెడ్డి భేటీ

హైదరాబాద్:

తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభల్లో తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం వారిద్దరూ హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. తదుపరి విలేకరులతో మాట్లాడారు.  బహిరంగ సభలకు ఆహ్వానించేందుకు  ఆమెను కలిశామని వివరించారు. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందనేది సరికాదనీ, ఆ కారణంగానైనా అసెంబ్లీ జరిగి ప్రజాసమస్యలపై చర్చకు అవకాశముంటుందనీ వారు చెప్పారు.  టీడీపీని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని వారు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటున్న బాబు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రజాభీష్టం మేరకే తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు వివరించారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని అమర్నాథ్ రెడ్డి చెప్పారు.

Back to Top