విద్యుత్‌పై మహానేత వైయస్ హామీకి ఇదే సాక్ష్యం

మంచిర్యాల (ఆదిలాబా‌ద్‌ జిల్లా) : ‘ఇచ్చిన మాట తప్ప లేదు.. మరో ఐదేళ్ళూ విద్యుత్ చార్జీలు పెంచేది లేదు’ అని 2009లో అప్పటి ముఖ్యమంత్రి‌ డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ కార్మిక విభాగం రాష్ట్ర ‌అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ ‌పేర్కొన్నారు. ప్రజలు తన ఆరాధ్య దైవమని, వారి సంక్షేమం దృష్ట్యా మరో ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచబోమని 2009 ఫిబ్రవరి 9న మహానేత వైయస్ స్పష్టం చేశారని, ఈ మేరకు ప్రభుత్వ ప్రకటన కూడా జారీ అయ్యిందని ఆయన వివరించారు. సంబంధిత ఆధారాలను కూడా చూపించారు.

‌వాస్తవం ఇలా ఉంటే పిసిసి ఛీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ.. వై‌యస్ అలా చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవని, తాము అలా అనలేదని వ్యాఖ్యానించడం శోచనీయమని అన్నారు. ‌మంచిర్యాల ఐ.బి. విశ్రాంతి భవనంలో ఆదివారంనాడు జనక్‌ప్రసాద్ విలే‌కరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిందని, విద్యుత్ చార్జీలు పెంచబోమంటూ.. అది తమ విద్యుక్త‌ ధర్మం అని వైయస్ పేర్కొన్నారని చెప్పారు. ‌అప్పటి వైయస్ ‌కేబినెట్‌లో బొత్స కూడా ఉన్న విషయాన్ని జనక్‌ప్రసాద్ గుర్తుచేశారు. బొత్స చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన వ్యాఖ్యలను బొత్స వెంటనే ఉపసంహరించుకోవాలని జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు.

‌మహానేత వైయస్‌ఆర్ ‌బ్రతికి ఉంటే విద్యుత్ చార్జీలు పెరిగేవి కావని, ప్రజలపై రూ.6‌500 కోట్లకు పైగా భారం పడేది కాదని జనక్‌ప్రసాద్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైయస్ హామీకి భిన్నంగా ప్రస్తుత కాంగ్రె‌స్ ప్రభుత్వం విద్యు‌త్ చార్జీ‌లు పెంచి ప్రజల నడ్డివిరుస్తోందని ఆయన విమర్శించారు. విద్యుత్ సంక్షోభంతో రైతాంగం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతోందని ‌ఆవేదన వ్యక్తంచేశారు.

‌విద్యుత్ చార్జీల పెంపుపై దీక్ష అంటూ నేడు దొంగ నాటకాలు ఆడుతున్న చంద్రబాబు.. నాడు బషీర్‌బాగ్‌లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి చంపించారని జనక్‌ప్రసాద్‌ నిప్పులు చెరిగారు. విద్యుత్ చార్జీలను పెంచిన రోజునే ‌దీక్షలు విరమించడం చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతోందని జనక్‌ప్రసాద్ ‌తెలిపారు.
Back to Top