ఛార్జీలు తగ్గించేవరకూ దీక్ష చేస్తాం: శ్రీమతి విజయమ్మహైదరాబాద్, 4 ఏప్రిల్‌ 2013:
విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం మోపిన రూ.6,500 కోట్ల భారం తగ్గించేవరకు నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తామని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ స్పష్టం చేశారు.‌ 'కరెంట్‌ సత్యాగ్రహం' మూడవ రోజు గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఎన్ని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

'విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షిస్తారట. ఇంతవరకూ ఏం చేస్తున్నార'ని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. విద్యుత్‌ సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచడం సరైంది కాదని, ముఖ్యమంత్రి కిరణ్‌ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ నాయకులే వ్యాఖ్యానిస్తున్న వైనాన్ని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్‌, జలాశయాల్లో నీటిమట్టంపై డాక్టర్‌ వైయస్‌ ప్రతిరోజూ ఉదయాన్నే సమీక్షించేవారని ఆమె పేర్కొన్నారు.
Back to Top