వెన్నుపోట్ల రాజకీయం పరిపాలన దక్షత అంటారా?


గూడూరు (కర్నూలుజిల్లా) 19 నవంబర్ 2012 : చంద్రబాబులాగా తమకు డబ్బు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కోవలసిన అగత్యం లేదని షర్మిల అన్నారు. వారికి మనస్సాక్షి ఉంది కనుక, నిజాయితీ పక్షాన నిలవాలని తలచారు కనుక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్రలో చెబుతున్న మాటలను సొంత ఎమ్మెల్యేలే నమ్మటం లేదన్నారు. 33వ రోజు పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం జరిగిన ఒక భారీ బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. చంద్రబాబు తీరుపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడ్డారు. తమకి మాత్రమే పరిపాలన దక్షత, తెలివీ, అనుభవం ఉందన్నట్లు మాట్లాడుతున్నచంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు, అబద్ధాలకు మారుపేరుగా నిలిచారని ఆమె దుయ్యబట్టారు. రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదున్నరకి పెంచడం, బెల్టుషాపులు పెట్టడం పరిపాలన దక్షత అవుతుందా అని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించారు.
షర్మిల మాటల్లోనే...
"చంద్రబాబు పాదయాత్ర అంటూ డ్రామాలు చేస్తున్నారు. మా బోటివారు పాదయాత్ర చేస్తే అర్థముంది కానీ చంద్రబాబు పాదయాత్రలు చేయాల్సిన అవసరమే లేదు. 'అవిశ్వాసం తీర్మానం' పెట్టి ఈ  వెంటనే ప్రభుత్వాన్ని దించేయడానికి కావలసినంతమంది ఎమ్మెల్యేలున్నారు. కానీ దించడట. ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదంటూ తుగ్లక్ పరిపాలన అని చెప్పుకుంటూ విమర్శిస్తూ తిరుగుతాడుగాని, 'అవిశ్వాసం' మటుకు పెట్టడట. అడుగడుగునా ప్రజలు చెబుతూనే ఉన్నారు, ఈ సర్కార్‌పై తమకు విశ్వాసం లేదని. కానీ ఆయనకి మటుకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నట్లుగా అవిశ్వాసం పెట్టడట. చంద్రబాబు మాటలకూ చేతలకూ ఎప్పుడూ పొంతన ఉండదు. చంద్రబాబునాయుడుగారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నారు.
వారికి మటుకే తెలివి ఉందన్నట్లు, వారికి మటుకే పరిపాలనాదక్షత ఉన్నట్లు, మిగతావారికి తెలివి లేదు, అనుభవం లేదు అని తక్కువ చేసి చిన్నగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ టైములో రెండు రూపాయలున్న కిలో బియ్యాన్ని ఐదున్నర రూపాయలు చేసింది మీరు కాదా? దానిని పరిపాలనా దక్షత అంటారా అని చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నాం. పూర్తి మద్యనిషేధమని చెప్పి ఎక్కడ చూసినా బెల్టు షాపులు పెట్టించారు మీరు. దానిని పరిపాలనా దక్షత అంటారా? అని అడుగుతున్నాం. వెన్నుపోటు రాజకీయాలకు, అబద్ధాలకు మారుపేరుగా నిలిచారు మీరు. దానిని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి, వైస్రాయిలో ఎమ్మెల్యేలను బంధించి, డబ్బుతో కొనుక్కున్నారు మీరు. దాన్ని పరిపాలన దక్షత అంటారా, అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో చెబుతున్న మాటలను సొంత ఎమ్మెల్యేలే నమ్మకుండా మా పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. పైగా చంద్రబాబునాయుడుగారు అంటున్నారు ఎంత పెట్టి కొనుక్కున్నామని. మేము కొనుక్కోలేదు బాబుగారూ! మాకు మీలాగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు మనస్సాక్షి ఉంది కనుక, నిజాయితీ పక్షాన నిలబడాలనుకున్నారు కనుక మిమ్మల్ని వదిలేసి మా దగ్గర చేరుతున్నారు."అని షర్మిల అన్నారు.

Back to Top