బాబు..పేదలంటే మీకు ఎందుకంత కక్ష

చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా
అసైన్డ్ భూములేమైనా మీ అత్తసొత్తా చంద్రబాబు
సోలార్ ప్లాంట్ కు పేదల భూములు ధారాదత్తం చేస్తారా
పరిహారం పైసా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు
పంటలు పండే భూములను ఇవ్వడం అన్యాయం
సోలార్ ప్లాంట్ నిర్వాసితులకు వైయస్ జగన్ బాసట

అనంతపురం(ఎన్‌పీ కుంట) : అసైన్డ్ భూములు తన అత్తగారి సొత్తన్నట్లు చంద్రబాబు సోలార్ ప్లాంట్ కు ధారాదత్తం చేయడం దారుణమని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఐదోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా వైయస్ జగన్...ఎస్ పీ కుంటలో సోలార్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు అండగా నిలిచారు. ఈసందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడారు. రాయలసీమలో సాగునీటి వసతి ఉండి.. పంటలు పండటమే కష్టమని, అలాంటిది కాస్తో కూస్తో నీటి వసతి ఉండి.. పంటలు పండే భూములనే సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...!

పంటలు పండే భూములు లాక్కుంటారా..
సోలార్ ప్లాంటు పెట్టడం కోసం భారీ మొత్తంలో భూములను ఎన్టీపీసీకి ప్రభుత్వం ధారాదత్తం చేసింది. 7500 ఎకరాల్లో 750 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు పెడతామని, ఎన్నో ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సోలార్ పవర్ ప్రాజెక్టు ఇక్కడే ఉంటే.. ఇక్కడివాళ్లకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు? అలాంటప్పుడు ప్రాజెక్టుకు భూములు ఎందుకు ఇవ్వాలి. ఆ భూములకు ఒకవైపు పెద్దపల్లి రిజర్వాయర్, మరోవైపు వెలిగొండ రిజర్వాయర్ ఉన్నాయి. భూమి మధ్యలో నుంచి హంద్రీనీవా కాలువ పోతూ ఉంటుంది. సీమలో పంటలు పండని పరిస్థితిలో.. కాస్తో కూస్తో పండే భూములే అవి. అక్కడే ఆ భూములే ఇవ్వడంలో అర్థమేముంది.  ప్రభుత్వానికి రవ్వంతైనా తెలివి ఉందా..?

మీ అత్తసొత్తా..
ఈ భూముల్లో దాదాపు 2220 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్నాయి. వీటిని భూములు లేని పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి  ఇచ్చారు. పేదవాడి భూములంటే చంద్రబాబు ఆయన అత్తగారి సొత్తనుకుంటారు. 153 ఎకరాల పట్టాభూమికి రూ. 3.25 లక్షలు ఇస్తారు. ఎసైన్డ్ భూములకు కేవలం రూ. 2.10 లక్షలు ఇస్తే సరిపోతుందంటారు. పేదవాళ్లంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం. వాళ్ల భూములు భూములు కావా. పేదలు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ ఇవ్వాలి లేదా సమానంగానైనా ఇవ్వాలి. 

బాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా..
1250 ఎకరాలను సాగుదారు రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నారు. వాటికి పన్నులు కడుతున్నారు, బోర్లు వేశారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. వాళ్ల పేరుతో పట్టాలిచ్చి ఆదుకోవాల్సింది పోయి నీళ్లున్నచోట సోలార్ ప్రాజెక్టు పెట్టడం ఏంటి. సాగుదారు రైతులకు ముష్టి వేసినట్లు లక్ష రూపాయలు అని ఇస్తామని చెబుతారు. అధి కూడా ఇంతవరకు రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. సర్వేలు, నోటీసులు అంటారు గానీ పరిహారం మాత్రం ఇవ్వరు. ఎన్టీపీసీ వాళ్లు భూమలు మొత్తాన్ని చదును చేసేసి.. అక్కడ సోలార్ ప్యానళ్లు కూడా పెట్టేశారు.  ఇప్పుడు పక్క రైతులు ఆ భూములు మీవేనని చెబితే పరిహారం ఇస్తామని అంటున్నారు. చంద్రబాబుకు  బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా.

రైతుల తరపున పోరాడుతాం..
ఇంత దారుణంగా చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మనసు, మానవత్వమేమైనా ఉందా. అసైన్డ్ భూములు కోల్పోయిన, సాగుదారు రైతుల తరఫున అడుగుతున్నా. ఇచ్చే 3.25 లక్షలే తక్కువ.. దాన్ని అందరికీ ఎందుకు వర్తింపజేయరు. ఖచ్చితంగా  రైతుల తరఫున పోరాడతాం, వారికి తోడుగా, బాసటగా నిలబడతామని వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top