'వైయస్ మీ అల్లుడు..జగన్ మీ మేనల్లుడు...'

ధర్మవరం

26 అక్టోబర్ 2012 :  "రాజశేఖర్ రెడ్డిగారు మీకు అల్లుడు. మీరు పిల్లనిచ్చారండీ! మా అమ్మగారి నాన్నగారు అనంతపురంవాసులే. జగనన్న మీకు మేనల్లుడు. అందుకే అనంతపురం అంటే రాజశేఖర్ రెడ్డిగారికి చాలా ప్రీతి." అని షర్మిల ధర్మవరం సభలో వ్యాఖ్యానించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సభలో షర్మిల జనాన్ని ఆకట్టుకునే రీతిలో ఛలోక్తులతో ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డికి అనంతపురంతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ తండ్రిగారు అనంతపురంవాసులేనని ఆమె చెప్పారు. అలా జగన్ మీకు మేనల్లుడౌతాడంటూ ఆమె సభలో నవ్వులు పూయించారు.
"మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు, మీ షర్మిల మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది" అంటూ ఆమె జనంతో క్రిక్కిరిసి సభలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
"రాజస్థాన్ తర్వాత దేశంలో అతితక్కువ వర్షపాతం నమోదయ్యేది అనంతపురం జిల్లాయే. అందుకనే అనంతపురం జిల్లా అంటే ఆయనకు ప్రత్యేక శ్రద్ధ. అనంతపురం చరిత్రలో ఎన్నో కరువులను ఎదుర్కొంది. ఇక్కడ తాగునీరు, సాగునీరు ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతం ఎడారి అయిపోతుందని, జనం బ్రతికే అవకాశమే ఉండదని...రాజశేఖర్ రెడ్డిగారు విశ్వసించి హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగు వేల కోట్ల రూపాయలు దానిమీద ఖర్చు చేసి, ఇది పూర్తి చేయాలని కలలు కన్నారు. ఇది పూర్తయితే కేవలం అనంతపురం జిల్లాకే 4 లక్షల ఎకరాలకు నీరందుతుంది. చాలా భాగం పనులు కూడా పూర్తి అయ్యాయి. చిన్నపనులు మాత్రం మిగిలాయి. కానీ వాటిని పూర్తి చేసే విషయం ఈ ప్రభుత్వానికి పట్టలేదు" అని షర్మిల విమర్శించారు.

Back to Top