'వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వరుణదేవుడు!'

పెరవలి (ప.గో.జిల్లా) :

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూసినా ఆయన కుటుంబాన్ని చూసినా వరుణదేవుడికి చెప్పలేనంత సంబరం పుట్టుకొస్తుంది. సరిగ్గా ఏడేళ్ళ క్రితం మహానేత వైయస్‌ఆర్‌ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి గ్రామానికి వచ్చినప్పుడు అప్పటి దాకా చండ్ర నిప్పులు చెరిగిన సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. నిప్పులకొలిమిని తలపించిన ఆ రోజు వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడిపోయింది. వానదేవుడు తన చిరు జల్లులతో ఎండలతో అల్లాడిని ప్రజలకు ఊరటనిచ్చాడు. సరిగ్గా ఏడేళ్ళ తరువాత మహానేత రాజన్న తనయ శ్రీమతి షర్మిల జూన్‌ 1న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రగా పెరవలి గ్రామానికి చేరుకున్నారు. గతంలె రాజన్న వచ్చిన నాటి అనుభూతులే ఇప్పుడు పునరావృతం అయ్యాయి. కాకతాళీయమే అయినా ఈ రెండు సంఘటనలను తలచుకుని పెరవలి గ్రామస్థులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

2006, మే 31.. : పెరవలి పరిసర గ్రామాలకు అప్పటి సిఎం వైయస్ రాజశేఖరరెడ్డి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వచ్చారు. పొద్దంతా వేడి కొలిమిలా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి జల్లులు కురిశాయి..

2013, జూన్ 1..‌: పెరవలి మండలంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర. పొద్దంతా సెగలు గక్కిన సూర్యుడు సాయంత్రం 5.35 గంటలకు మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. చూస్తుండగానే ఆకాశం మేఘావృతం అయింది. దట్టమైన మబ్బులు విస్తరించాయి. వర్షం కురిసింది.

యాదృచ్ఛికంగానే అయినా.. నాటి సంఘటన పునరావృతమైంది. దీంతో పెరవలి పరిసర గ్రామాల ప్రజలు కేరింతలు కొట్టారు. వర్షం కురిసినంత సేపు జనం ‘వైయస్ జిందాబా‌ద్’ అంటూ నినాదాలు చేశారు. ఇది ఈ ఏడాది పంటలకు శుభసూచకం అని స్థానిక రైతు కరుటూరి గోపి సంతోషం వ్యక్తం చేశారు. ‘వరుణ దేవుడు కాంగ్రె‌స్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడని‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ఎప్పుడు చెప్పేవారు. ఆ వానదేవుడు ఇప్పుడు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరినాడు. అందుకే గతంలో మండు వేసవిలో‌ శ్రీ జగన్మోహ‌న్‌రెడ్డి పాదయాత్ర చేసిన చోట, ఇప్పుడు రాజన్న కూతురు నడుస్తున్న చోట వర్షాలు కురుస్తున్నాయి’ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం‌ పేర్కొన్నారు.

Back to Top