<strong>హైదరాబాద్, 21 నవంబర్ 2012:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మైనార్టీ నేతల చేరికలు కొనసాగుతున్నాయి. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మైనార్టీల అభివృద్ధికి చేసిన సేవలకు కృతజ్ఞతగా ఆయన కుటుంబానికి అండగా ఉండాలని మైనార్టీ నాయకులు భావిస్తున్నారు. వైయస్ ఆశయాలను అమలు చేయడమే ప్రధాన అజెండాగా ప్రారంభమైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ వల్లే అవి సాధ్యమని ప్రగాఢంగా విశ్వసిస్తున్న పలువురు ముస్లిం మైనార్టీ నేతలు వైయస్‌ఆర్‌సిపిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముస్లిం మైనార్టీలకు వైయస్ కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల కారణంగానే ఎందరో ముస్లిం యువతీ యువకులు ఉన్నత విద్యలు అభ్యసించడానికి దోహదం చేసిందని వారంతా పేర్కొంటున్నారు.<br/>ఈ క్రమంలో మాజీ మంత్రి ఎంకే బేగ్ కుమారుడు షఫీవుల్లా బేగ్, ఆయన సోదరి షకీలా బేగం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నివాసంలో ఆమె సమక్షంలో షఫీవుల్లా, షకీలా పార్టీలో చేరారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఎంకే బేగ్ బాధ్యతలు నిర్వహించారు. షఫీవుల్లాతో పాటు మరో 10 మంది మైనార్టీ నాయకులు కూడా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.