వైయస్‌ఆర్ కాంగ్రెస్ లౌకికవాద పార్టీ: బాజిరెడ్డి

ఆర్మూ‌ర్ (నిజామాబా‌ద్‌ జిల్లా): వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అన్ని మతాల వారు ఆదరించే లౌకిక వాద పార్టీ అని ‌వైయస్ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. ఆర్మూ‌ర్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ మతతత్వ పార్టీ కాదని అన్నారు. వైయస్‌ఆర్‌సిపి ప్లీనరీలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అదే విధానాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా తెలియజేశామన్నారు.‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అందించిన సేవలకు ఆకర్షితులై మైనార్టీ నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు.

టిఆర్ఎ‌స్, ‌టిడిపి లాంటి పార్టీలు తమపై ఎన్ని అబద్ధపు ఆరోపణలు ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పనితీరుపై, దర్యాప్తు సంస్థలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే అధికారం రాజకీయ పార్టీగా తమకు ఉందన్నారు. అందుకే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి కోటి సంతకాలతో నివేదించనున్నామని బాజిరెడ్డి తెలిపారు.‌
Back to Top