హైదరాబాద్: వచ్చే నెల 5వ తేదీన వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలవుతారన్న ఆశాభావాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరోజున సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతాయనీ, బెయిలు లభిస్తుందనీ ఆయన చెప్పారు. న్యాయపరంగా కూడా అలాంటి వాతావరణమే నెలకొని ఉందని అంబటి అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టయి ఇప్పటికీ 120 రోజులు దాటిందన్నారు. అరెస్టు చేసిన 90 రోజులలో విచారణ పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇది దర్యాప్తు సంస్థపై సాంకేతికపరంగా ఉన్న బాధ్యతన్నారు. తొంభై రోజులు దాటింది కాబట్టి.. దర్యాప్తు పూర్తయ్యిందని భావించాల్సి ఉంటుందన్నారు. వాయిదా బెయిలు విచారణ వాయిదా పడిందని జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహ పడవద్దని అంబటి ధైర్యం చెప్పారు. వచ్చే నెల 5 వ తేదీన తప్పకుండా ఆయనకు బెయిలు వస్తుందన్నారు. కడిగిన ముత్యంలా జగన్ బయటకు వస్తారనీ, దీనికోసం మరోసారి భగవంతుణ్ణి పూజిద్దామనీ ఆయన తెలిపారు. <br/>