వాయిదా తీర్మానాలపై అసెంబ్లీలో గందరగోళం

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తీరు మారలేదు. నాలుగురోజుల సెషన్‌లో మూడో రోజు కూడా శాసన సభలో గందరగోళం చెలరేగింది. కౌన్సిల్ కూడా ఇదే తీరును తలపించంది.  నినాదాలు, వాగ్వివాదాల నడుమ సభ శుక్రవారానికి వాయిదా పడింది. ప్రజా సమస్యలు దేనిపైనా చర్చ సాగలేదు. వాయిదా తీర్మానాల నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలుత మూడుసార్లు సభను వాయిదా వేశారు. పరిస్థతిలో మార్పు లేకపోవడంతో చివరకు శుక్రవారానికి సభ కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు.  సభ ప్రారంభం కాగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ వాటిని తిరస్కరించారు. 
డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధింపు, చిల్లర వాణిజ్యంలో ఎఫ్‌డీఐలకు అనుమతి అంశాలపై వైయస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చింది. వాటిపై చర్చకు పట్టుబడుతూ సభ్యలు నినాదాలు చేస్తూ, స్పీకర్ పోడియం వద్దకు చేరారు. దీనితో స్సీకర్ సభను గంట సేపు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత అదే పునరావృతమైంది. దీనికి తోడు టీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ అంశంపై సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై విస్తృత చర్చ జరగాలని వైయస్ఆర్ కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభానాయకుడు మరోసారి సభను వాయిదా వేశారు. 
వాయిదాకు ముందు ప్రభుత్వం మూడు బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టింది. మూడో సారి సభ సమావేశమైనప్పుడు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ వాయిదా వేశారు. నాలుగో సారి సభ కొలువుతీరినప్పుడు సైతం గందరగోళం చెలరేగడంతో విధిలేని పరిస్థితిలో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. 
శాసన మండలిలోనూ..
లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సైతం ప్రతిపక్ష సభ్యలు వాయిదా తీర్ఆమనాల ఆమోదానికి పట్టుబట్టారు. ఈ సందర్భంగా గలాభా చోటుచేసుకుంది. ఛైర్మన్ చక్రపాణి సభను రెండుసార్లు వాయిదా వేయాల్సివచ్చింది. తదుపరి ప్రతిపక్ష సభ్యులు కౌన్సిల్ బయట ధర్నకు దిగారు. డీజిల్ ధరలు తగ్గించాలనీ, సబ్బిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్య కుదింపును విరమించుకోవాలనీ వారు డిమాండ్ చేశారు. 
Back to Top