వాన్‌పిక్ కేసు విచారణ అక్టోబర్ 9కి వాయిదా

హైదరాబా‌ద్, 25 సెప్టెంబర్‌ 2012: వాన్‌పిక్‌ భూముల కేటాయింపు కేసులో తదుపరి విచారణను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు‌కు సంబంధించి వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి రిమాండ్‌ను అక్టోబర్‌ 9వ తేదీ వరకూ పొడిగించింది. ఇదే కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్,‌ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు కూడా కస్టడీని పొడిగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. వాన్‌పిక్‌ కేసులో జ్యుడీషియ‌ల్ కస్టడీలో లేని మిగతా వారంతా కూడా అక్టోబర్‌ 9న కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
కాగా, మంగళవారం ఉదయం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన జగన్మోహన్‌రెడ్డి కోర్టు హాలులో రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కరచాలనం చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేసిన అనంతరం జరన్‌ కోర్టు అనుమతి తీసుకుని తల్లి వైయస్‌ విజయమ్మను, సతీమణి భారతీరెడ్డిని కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఆయన తిరిగి చంచల్‌గూడ జైలుకు వెళ్ళారు.
విచారణ వాయిదా పడిన అనంతరం నాంపల్లి కోర్టు వద్ద వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యనిర్వాహకవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ హెచ్ ఏ రెహ్మా‌న్‌ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన ధర్మాన ప్రసాదరావు రూ.25 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తును కోర్టుకు సమర్పించారు. మళ్ళీ అక్టోబర్ 9న కోర్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది.
Back to Top