‘ఉప ప్రణాళిక’కు చట్టబద్ధత ఆలోచన వైయస్‌దే

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ‌ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలనే ఆలోచన చేసింది దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి అని పోలవరం ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా వై‌యస్‌ఆర్‌సిపి కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా భేటి అయిన శాసనసభ సమావేశాల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ చ‌ట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది వైయస్సేనని బాలరాజు గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం వైయస్ నోడ‌ల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఆరు నెలల‌కు ఒకసారి చట్టం అమలు, నిధుల వ్యయంపై సమీక్షించాలని సూచించారన్నారు. దీని ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయనేది మహానేత వైయస్ ఆలోచన‌ అని బాలరాజు చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ పొందుపరిచిన అంశాలనే చట్టం చేసి తామే అంతా చేశామని మసిపూసి మారేడు కాయ చేస్తుందని ఎద్దేవా చేశారు.‌

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చ‌ట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. చట్టం దుర్వినియోం అయితే కేసులు నమోదు చేసి కనీసం ఏడు, ఎనిమిదేళ్లు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బాలరాజు కోరారు. రాజ్యాంగం, చట్టం ఎంత గొప్పదైనా అమలు చేసే అధికారుల్లో చిత్తశుద్ధి అవసరమని అంబేద్కర్ చెప్పిన మాటలను బాలరాజు ప్రస్తావించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు నిబ‌ద్ధతతో కృషి చేయాలని కోరారు.
Back to Top