పులివెందుల, 21 అక్టోబర్ 2012: పులివెందుల నుండి నాలుగవ రోజు పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికి కొందరు ఒక బాటిల్‌లో మురికిగా, అపరిశుభ్రంగా ఉన్ననీళ్లు తెచ్చి షర్మిలకు చూపారు. గత రెండున్నరేళ్లుగా తమకు మంచినీళ్లు ఇలాగే వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఆపే ఆ సీసాను ఎత్తిపట్టుకుని -"ఈ నీళ్లని కిరణ్ కుమార్ రెడ్డికో, చంద్రబాబునాయుడుగారికో శాంపిల్ పంపించి తాగించండి" అని షర్మిల జనాన్ని ఉద్దేశించి అన్నారు. కిరణ్, బాబు ఇలాంటి నీళ్లతో కనీసం చేతులు కూడా కడుక్కోరని ఆమె వ్యాఖ్యానించారు.కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఉండడం లేదని విద్యార్థులు షర్మిలకు పాదయాత్రలో ఫిర్యాదు చేశారు. దీనిపై మాట్లాడుతూ "ఈ ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా?" అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ ఉండీ లేనట్లుగా ఉందనీ, ఇది నిద్రనటిస్తోన్న ప్రభుత్వమనీ ఆమె నిందించారు. "కిరణ్ కుమార్ రెడ్డిగారు నిద్ర లేవక సమయానికి కరెంటు కొనలేదు. ఇప్పుడు కొనుక్కుందామన్నా లేదు" అని ఆమె వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.తమ బతుకులు భారమైపోయాయని వృద్ధులు కొందరు షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకోగా జగనన్న వచ్చాక పింఛను పెంచుతాడంటూ వారిని ఆమె ఓదార్చారు."దేవుడనే వాడున్నాడు.ఒక రోజు వస్తుంది. ఆనాడు దేవుడే జగనన్నను బయటకు తీసుకువస్తాడు. ఎవరూ అధైర్యపడవద్దు. మంచికాలం ముందుంది..."అంటూ ఆమె జనానికి రాజన్న రాజ్యం వచ్చి తీరుతుందని భరోసా ఇచ్చారు.