ఉద్విగ్నభరితం.. విజయమ్మ ప్రసంగం

హైదరాబాద్: ప్రపంచ చరిత్రలో మహోన్నత కార్యానికి సిద్ధమైన వేదిక కొద్దిసేపు ఉద్విగ్నతకు లోనైంది. కుమారుడు జైలులో ఉన్నాడు... కుమార్తె రోడ్డుపై నిలబడింది... మీ చేతుల్లో పెడుతున్నా అన్నప్పుడు వైయస్ విజయమ్మ స్వరం వణికింది. గొంతు జీరబోయింది. కంట నీరు చిప్పిల్లింది. అప్పటి వరకూ హర్షధ్వానాలతో మార్మోగిన సభా ప్రాంగణం ఒక్కసారిగా నిశ్శబ్దతరంగమైంది. 
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాదయాత్ర ప్రారంభ వేదికలో ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది. సభకు హాజరైన జనసాగరాన్ని కదిలించింది. షర్మిల పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ఇడుపులపాయ వేదికగా సాగిన బహిరంగ సభలో ఆమె గురువారం ఉద్వేగభరితంగా మాట్లాడారు. జగన్ను ఆదరించినట్లుగానే షర్మిలను కూడా అక్కున చేర్చుకోవాలని విజయమ్మ కోరారు. ఓ బిడ్డ జైలులో ఉంటే మరో బిడ్డను మీ ముందుకు పంపిస్తున్నానంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల భరోసానే తమ కుటుంబానికి అండదండగా ఉన్నాయన్నారు. వైఎస్ను ప్రేమించే ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని విజయమ్మ తెలిపారు. జగన్కు బెయిల్ వస్తే షర్మిల చేపట్టిన పాదయాత్రను కొనసాగిస్తారని ఆమె చెప్పారు. తన ప్రసంగం ఆద్యంతం ఆమె రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. వారి కార్యాచరణను తూర్పారబట్టారు.ఆమె చేసిన ప్రతి విమర్శకూ హాజరైన అశేష ప్రజావాహిని హర్షధ్వానాలతో ఆమోదం పలికారు.

తాజా వీడియోలు

Back to Top