రేపు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంహైద‌రాబాద్‌: బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి పాటుపడిన మ‌హాత్మా జ్యోతిరావుపూలే వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వ‌హిస్తున్న‌ట్లు కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అన్ని ప్రాంతాల్లో జ్యోతిరావు ఫూలే చిత్ర‌ప‌టాల‌కు, విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించాల‌ని, ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ మాలి కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరావు ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతని 9నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 12 సంవత్సరాల వయసులోనే పూలె గారికి వివాహం చేశారు. ఇతని భార్య సావిత్రి బాయ్ ఫులే. 

     మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆధునిక భారతీయ నవయుగ వైతాళికుడు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మాలికులంలో జన్మించి భారతదేశానికి మార్గదర్శనం చేసిన మహనీయులు. ఎందరో ఫూలే నుండి స్ఫూర్తి పొంది సంఘ సంస్కరణలు చేపట్టారు. సమాజంలో నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఇంగ్లాండు వారి వలస పాలన, బ్రాహ్మణాధిక్యత, దురాగతాలు, బాల్య వివాహాలు కొనసాగుతున్న కాలంలో జన్మించి స్వయంకృషితో దేశానికి వెలుగుదివ్వె అయ్యారు. మరాఠీలో, ఇంగ్లీషులో చదువుకొని, రెండు భాషల్లోను అనేక రచనలు చేశారు. సామాజిక ఉద్యమకారుడిగా ఫూలే స్పర్శించని అంశం లేదు. కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించారు. మనుషులందరూ సమానమేనని, దేవుడు ఒక్కడే అని, దేవుడు ముందు అందరూ సమానమేనని, దేవుడ్ని కొలవడానికి మధ్యవర్తిగా పూజారులు, బ్రాహ్మణులు అక్కరలేదని ఫూలే ప్రబోధించారు.

మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్నిబట్టి కాదని, జీవితమంతా పోరాడారు. రాజుల కాలంనాటి దౌర్జన్యాలను ఎదిరించారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను, సంస్కృతిని, జీవన విధానాన్ని అధ్యయనం చేశారు.  అన్నిటికీ ఆధునిక విద్య ముఖ్యమని భావించారు. మూఢ నమ్మకాలను తొలగిస్తే తప్ప ప్రజలు చైతన్యవంతులు కారని, ఉద్యమించారు. ఏ కులం గొప్పది కాదు. ఏ కులం చిన్నది కాదు, అన్ని కులాలు సమానమే అని భావించిన ఫూలే బ్రాహ్మణులను కూడా కలుపుకొని అనేక సంఘసంస్కరణలను చేపట్టారు. స్త్రీవిద్యకు ప్రాధాన్యతనిచ్చారు. వితంతువుల కష్టాలను చూసి చలించిపోయారు. బాల్య వివాహాల వల్ల, 15-20 ఏళ్ళ లోపే వితంతువులై దుర్భర జీవితం జీవిస్తూ తల్లులైన వారి గర్భశోకాన్ని గమనించారు. గర్భస్రావాలవల్ల చనిపోతున్న వితంతువులను మానవతా దృక్పథంతో చేరదీసి వారు పిల్లల్ని కనాలని, ఆ పిల్లలను సాదరంగా పెంచి పోషించాలని, వారి కోసం స్కూళ్ళను, హాస్టళ్ళను ప్రారంభించారు. నిమ్నవర్గాల బాలబాలికలకు విద్య అందిస్తే రాబోయే తరం ఎంతగానో ఎదుగుతుందని భావించారు. ఫూలే కృషిని గమనించి డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ తండ్రి రామ్‌జీ ఎంతగానో ప్రభావితులయ్యారు.

తన పిల్లలను బాగా చదివించాలని భావించారు. ఆనాటి సమాజంలో బాల్య వివాహాలే జరిగేవి. సావిత్రిబాయి ఫూలేతో జ్యోతిబా ఫూలే పెళ్ళి జరిగినప్పుడు ఇద్దరూ మైనారిటీ తీరనివారే. సావిత్రిబాయిని విద్యా వంతురాలిని చేసి, ఉపాధ్యాయు రాలిగా తీర్చిదిద్ది పాఠశాలను నడిపించారు. ఎంతో సంస్కారాన్ని అలవర్చుకున్న సావిత్రిబాయి ఫూలే ప్లేగువ్యాధి బాధితులకు సేవలు చేస్తూ ప్లేగు వ్యాధితోనే మరణించారు. ప్లేగు వ్యాధి అంటువ్యాధి అని తెలిసి కూడా జ్యోతిరావు ఫూలే 1890లో చనిపోయిన తర్వాత కూడా తన సేవలను కొనసాగించి ప్లేగువ్యాధితో 1897లో మరణించారు. ఇలా ఆదర్శ ఇల్లాలిగా, ఉపాధ్యాయురాలిగా, సంఘసేవకురాలిగా సావిత్రిఫూలే ఎదిగి దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ప్రసిద్ధికెక్కింది. ఇలా తన చుట్టూత ఉన్న ప్రజలను, ఎందరో మిత్రుల ఎదుగుదలకు, సమాజం కోసం, సంఘ సంస్కరణల కోసం కృషి చేశారు జ్యోతిరావు ఫూలే.

Back to Top