తెలంగాణ సమస్యకు కేంద్రానిదే బాధ్యత



భువనగిరి

29 అక్టోబర్ 2012 : తెలంగాణ సమస్య రావణకాష్ఠంలాగా తయారు కావడానికి కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. ఇంతమంది తెలంగాణ కోసం చనిపోతున్నారు, ఇంతమంది బాధపడుతున్నారంటే దానికి బాధ్యత కేంద్రానిదేనని ఆమె విమర్శించారు. ఏ పక్షానికీ నష్టం కలుగకుండా కేంద్రం సత్వరం తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నదే వైయస్ఆర్ సీపీ విధానమనీ, జగన్ ఈ విషయాన్ని మీకు చెప్పమన్నాడనీ ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 3 వ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రాన్నైనా ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికే దఖలు పడిందని ఆమె వివరించారు. సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి వైయస్ఆర్ సీపీలో చేరడాన్ని పురస్కరించుకుని జరిగిన ఒక భారీ బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు. తెలంగాణకు వైయస్ఆర్ సీపీ వ్యతిరేకం కాదని ఆమె వివరించారు. కేంద్రం సత్వరమే తెలంగాణ సమస్యను పరిష్కరించాలంటూ కోరుతున్నామని, జగన్ బాబు ఈ విషయం మీకు సభాముఖంగా చెప్పమన్నాడని ఆమె చెప్పారు.
"రాజశేఖర్ రెడ్డిగారైనా జగన్‌బాబు అయినా ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు. రాజశేఖర్ రెడ్డిగారికి తెలిసింది మనిషిని మనిషిగా ప్రేమించడమే. ఆయన అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఆశించింది, మన రాష్ట్రంలోని పేదల ముఖాలలో చిరునవ్వే. ప్రాణం పోయేంతవరకూ అదే ఆశించారు.నిరంతరం శ్రమించారు. జగన్ బాబు కూడా అదే ఆశిస్తున్నారు. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదని, వారి మనోభావాలను గౌరవిస్తామని జగన్ ప్లీనరీలో చెప్పడం జరిగింది. తెలంగాణ ఇచ్చేవాళ్లం కాదు,.తెచ్చేవాళ్లం కాదని ఆనాడే చెప్పాం." అని విజయమ్మ పార్టీ విధానాన్నిస్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలనీ, ప్రాజెక్టులు పూర్తికావాలనీ ఇదే తమ పార్టీ విధానమనీ ఆమె చెప్పారు.
తెలంగాణ కొరకు బలీయమైన ఆకాంక్షతో రిజైన్ చేసినప్పుడు ఎన్నికలు రాగా, ఆరుగురు ఎమ్మెల్యేలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టలేదని ఆమె గుర్తు చేశారు. వైయస్ఆర్ సీపీ అవకాశవాదపార్టీ కాదనీ, ఎప్పుడూ మాట మీద నిలబడేదనీ, విశ్వసనీయత కలిగి ఉన్నదనీ ఆమె చెప్పారు.
"ఆర్మూరులోనూ చెప్పాం. ఎన్నికలప్పుడూ చెప్పాం. తెలంగాణ సమస్యను పరిష్కరించమంటూ కేంద్రాన్ని కోరాం" అని  ఆమె గుర్తు చేశారు. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆనాడే ఎమ్మెల్యేలను రాజశేఖర్ రెడ్డిగారు ఢిల్లీకి తీసుకుపోయి తెలంగాణ ఆకాంక్షలను తెలియజేశారని ఆమె చెప్పారు.అంతా కలిసి ఉంటే మంచిదని వైయస్ వ్యక్తిగతంగా భావించినా ఏ ప్రాంతం మనోభావాలూ దెబ్బతినకూడదని తలచారని ఆమె చెప్పారు.
తెలంగాణలో కూడా మంచి వాతావరణం ఉండాలనీ, అందరం అన్నదమ్ముల్లాగా ఉండాలని, ఇదే తమ పార్టీ కోరుకుంటున్నదని ఆమె చెప్పారు.
రాజశేఖర్ రెడ్డిగారిని ప్రేమించే ప్రతిగుండెకు, జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రతి గుండెకూ నమస్కరిస్తున్నానని ఆమె అన్నారు. "నా భర్త రాజశేఖర్ రెడ్డిగారు చనిపోయినప్పుడు మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసి వచ్చింది. ఆనాడు తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువ మంది చనిపోయారు. ప్రాణాలు పోయేంతగా ఆయనని ప్రేమించారు. ఈ తెలంగాణ గడ్డకూ, తెలంగాణలో నివసించేవారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇవాళ" అని ఆమె తెలంగాణ గుండె తలుపు తట్టారు. తెలంగాణ ప్రజల బాధలు, కన్నీళ్లు, కష్టాలు చూసిన వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి సిఎం అయిన వెంటనే తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించేందుకు పూనుకున్నారని ఆమె అన్నారు. వెనుకబడిన రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా వైయస్ తెలంగాణ వెనుకబాటుతనాన్ని బాగా గుర్తించారని విజయమ్మ చెప్పారు. అందుకే  సిఎం అయిన వెంటనే వైయస్ ఉచిత విద్యుత్తు ఫైలుపైనే సంతకం చేశారని ఆమె గుర్తు చేశారు. ఆనాడు రూ. 1259 కోట్ల విద్యుత్తు బకాయీలను రద్దు చేశారనీ, అంతకు ముందు ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారనీ ఆమె తెలిపారు. ఉచితవిద్యుత్తు పథకంతో 24 లక్షల మంది లబ్ధి పొందగా వారిలో 14 లక్షల మంది తెలంగాణవారేనని విజయమ్మ వివరించారు. కరెంటుబకాయీల మాఫీతోనూ ఎక్కువ మంది లాభపడింది తెలంగాణవారేనని ఆమె అన్నారు.
జలయజ్ఞంతో శాశ్వతపరిష్కారంగా రూ. 51 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో 25 వేల కోట్లు తెలంగాణ ప్రాజెక్టులకే కేటాయించారని ఆమె చెప్పారు. రుణాల మాఫీతోనూ లాభపడింది ఎక్కువగా తెలంగణజిల్లాలేనని ఆమె అన్నారు. వైయస్ హయాంలోనే ఆరున్నర లక్షల ఎకరాలకు నీరివ్వడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు నీరిచ్చారనీ, నల్లగొండ జిల్లాలోని పల్లెలకు 90 శాతం కృష్ణాజలాలను ఇచ్చారని ఆమె తెలిపారు. అలీసాగర్, గుత్ప, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, వంటివాటిని వైయస్ పూర్తి చేశారనీ ఎల్లంపల్లి, కల్వకుర్తి, నెట్టంపల్లి, భీమా,దేవాదుల వంటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులూ తెచ్చారని, మొదలు కూడా పెట్టారనీ విజయమ్మ చెప్పారు. వైయస్ మన మధ్య నుండి వెళ్లిపోయాక ఆ ప్రాజెక్టులన్నీ పక్కకు పెట్టారని ఆమె విమర్శించారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డిగారే తీసుకువచ్చారనీ, దీని ద్వారా తెలంగాణజిల్లాలలో పదహారున్నర లక్షల ఎకరాలకు నీరు అందించాలని సంకల్పించారని ఆమె అన్నారు. ఎన్నో జిల్లాలకు దీని ద్వారా తాగునీరు అందుతుందనీ, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఒక మనిషికి కావలసిన భద్రతలన్నీ ఇవ్వాలని వైయస్ తలచారని ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకం, పెన్షన్లు, పావలావడ్డి వంటి పథకాలను ఆమె ప్రస్తావించారు.
ఇప్పుడు పాదయాత్ర అంటూ బయలుదేరిన చంద్రబాబు హయాంలో బతుకు తెరువు లేక జనం బొంబాయి, గల్ఫ్ వంటి ప్రాంతాలకు వలసలు పోయారనీ విజయమ్మ గుర్తు చేశారు. బాబు హయాంలోఆనాడు జనం తాగునీరు, సాగునీరు లేక దయనీయమైన పరిస్థితులలో ఉంటే, కరెంటు బిల్లులు కట్టడం లేదంటూ ప్రత్యేక పోలీసు స్టేషన్లు కూడా పెట్టి అరెస్టు చేసి రైతులను వేధించారనీ, వ్యవసాయం దండగన్నాడనీ, పరిహారం ఇస్తే దాని కోసమే చనిపోతారని రైతులను ఎగతాళి చేశాడనీ ఆమె దుయ్యబట్టారు. బెల్టు షాపులకు మూలం చంద్రబాబేనని ఆమె అన్నారు. చంద్రబాబు దొంగమాటలు, మాయమాటలు జనం నమ్మరని తనకు తెలుసునన్నారు.
"విశ్వసనీయత అంటే ఏమిటని చంద్రబాబు అడిగారు, ఆ మాటకు అర్థం బాబుకు తెలియదు. రాజశేఖర్ రెడ్డి, జగన్ బాబు మాటకు కట్టుబడి ఉంటారు. అదీ విశ్వసనీయత. జనానికి విశ్వసనీయత ఉంది. టిఆర్ఎస్‌తో కలిసి ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చుతున్నారు." అని విజయమ్మ అన్నారు.
"రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వమిది. కానీ ఆయన మాటలన్నీ తుంగలో తొక్కుతున్నారు. కరెంటు బిల్లులు 15 వేల కోట్లు భారం వేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ 900 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్ చార్జీలూ పెంచేశారు. ఫీజుల పథకాని కోత పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా దిగజారింది. సంక్షేమ పథకాలు అటకెక్కాయనీ, నిమ్స్ కట్టారు. ఆరు తెలంగాణ జిల్లాల కోసం. ఆ భవనాలు దిష్టి బొమ్మల్లా ఉన్నాయి. మూసీ శుద్ధి ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరందించాలని వైయస్ సంకల్పించారు. దానికీ దిక్కు లేదు. కాంగ్రె,స్, టిడిపి, సిబిఐ కలిసి జగన్ బాబును జైలుకు పంపారు." అని విజయమ్మ విమర్శించారు. అయితే జగన్ త్వరలోనే జనం మధ్యకు వచ్చి వైయస్ ఆశయాలను పూర్తి చేస్తాడనీ, సువర్ణయుగం తెస్తాడనీ ఆమె హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top