ప్రజల దృష్టిని మరల్చేందుకే పిచ్చి ఆరోపణలు

హైదరాబాద్ 28 సెప్టెంబర్ 2013:

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని ఎక్కడ అడుగుతారోననే భయంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రచేస్తున్నారని పార్టీ శాసన సభా పక్ష ఉప నేత భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో శనివారం ప్రచురితమైన 'ఆపరేషన్ కుమ్మక్కు' అనే వార్తకు ఆమె స్పందించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రాసినట్లు ప్రచురించారన్నారు. శ్రీమతి విజయమ్మ, మేకపాటి రాజమోహన్ రెడ్డి కలిసి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని రాశారన్నారు. టీడీపీ నేతలతో మాట్లాడించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్న తెలివితేటలను తాము అంగీకరిస్తున్నామనీ, కానీ అవే తెలివితేటలను రాష్ట్ర విభజన జరగకుండా ఉపయోగించాలనీ ఆమె కోరారు. ప్రజలు దీనిని హర్షిస్తారన్నారు. సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ప్రజలంతా రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే, తమ లేఖను ఎక్కడ ఉపసంహరించమంటారోననే భయంతో వారి దృష్టిని మరల్చడానికి టీడీపీ ఇలాంటి నీచ కృత్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశంలో ఎక్కడో కొందరు కలిసి 30 కోట్ల రూపాయల చొప్పున 1200 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకుంటే దానిని జగన్మోహన్ రెడ్డిగారికి అంటగట్టి, వార్తలు ప్రచురించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

నిరూపించు లేదా జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకో


శ్రీమతి విజయమ్మ గారు రాత్రి పది గంటలకు సోనియా అపాయింట్‌మెంట్ తీసుకున్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారని తెలిపారు. ప్రజల్లో పరువుపోతుందనే ఆలోచన కూడా లేకుండా తమ పార్టీపై ఈరకంగా మాట్లాడడం ఎంతవరకూ సమంజ.సమని నిలదీశారు. బెయిలు డీల్‌కు ఆధారాలివిగో అంటూ ఆరోపించడం కాదనీ, ఆధారాలు చూపించాలనీ ఆమె సీఎం రమేష్‌ను సవాలు చేశారు. వాటిని రుజువు చేయలేకపోతే రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటావా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. లేదా తప్పుడు ఆరోపణలు చేశానని ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డిగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడడం మానకపోతే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలా మాట్లాడేవారిని అదుపుచేయాల్సిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే ఇలా మాట్లాడుతున్నారన్నారు. మీరు మమ్మల్ని ఎన్నయినా తిట్టండి లేదా విమర్శించండి.. కానీ విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని శోభా నాగిరెడ్డి కోరారు. లేదా సమైక్యంగా ఉంచడానికి మమ్మల్ని డైరెక్టు చేయండి అని డిమాండ్ చేశారు. విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా ఏం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉంటే తమ నాయకుడు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ప్రకటించారు.

Back to Top