నంద్యాల: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీలో జరుగుతున్న అవమానాలు, అక్రమాలను సహించలేక ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, టీడీపీ శ్రేణుల నిర్ణయం మేరకు చక్రపాణిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. ఇటీవల శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి కూడా టీడీపీలో జరుగుతున్న అన్యాయాలను సహించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ వీడిన నాటి నుంచి తమ్ముడు చక్రపాణిరెడ్డిని అధికార పార్టీ అవమానిస్తూ వచ్చింది. అంతేకాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పని చేసిన వారికి అన్యాయం చేస్తుండటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అలాంటి పార్టీలో ఉండకూడదని చక్రపాణిరెడ్డి నిర్ణయానికి వచ్చారు. ఇవాళ వైయస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యి..ఈ నెల 3న నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శిల్పా చక్రపాణిరెడ్డి తన అనుచరులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.