టీడీపీ కేంద్రం నుంచి వైదొలగాలి

ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలిః వైఎస్సార్సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదంటూ హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా బీజేపీ, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేశాయి. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ సైతం బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ-బీజేపీలు ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టిన విషయాన్ని మిథున్ రెడ్డి ప్రస్తావించారు. బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని,  ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదాకు కేంద్రం నిబంధనలను సాకుగా చూపుతోందని, టీడీపీ ఇప్పటికైనా కేంద్రం నుంచి వైదొలగి ఒత్తిడి తేవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు, పారిశ్రామిక రంగానికి సమాధానం దొరుకుతుందని చెప్పారు.
Back to Top