టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కడతారు

  • మూడు అబద్ధాలు..ఆరు మోసాలు
  • ఇదీ బాబు పాలన తీరు
  • నోట్ల రద్దు పర్యావసనాలపై చర్యలేవి?
  • చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలపై ఆరోపణలు
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
హైదరాబాద్‌: రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పాలన సాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. టీడీపీ పాలన  మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరుతో వేలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, బడా వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి, దోపిడీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి కోసం అధికార పార్టీ నేతలు అధికారులపై సైతం దాడులకు పాల్పడటం సరైందని కాదని పత్రికలు కోడై కూసినా ప్రభుత్వం మేల్కోవడం లేదన్నారు. ప్రభుత్వం ఎక్కడా కూడా తమ విధానాలను పునఃపరిశీలించడం లేదని ధ్వజమెత్తారు. 

రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ బాబు భూబకాసురుడిలా అవతరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తల మెప్పుకోసం తాపత్రయపడుతున్నారని, తమ తప్పులు, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బందర్‌ పోర్టు, రాజధాని నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్టు, దివీస్, ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణ విషయంలో రైతుల గోడు పట్టించుకోకుండా అభివృద్ధి పేరుతో బలవంతంగా భూ సేకరణకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. విజయవాడలో 40 ఆలయాలను కూలగొట్టారని, అయినా బీజేపీ మాట్లాడే పరిస్థితిలో లేదని పార్థసారథి విమర్శించారు. తమ స్వార్థం కోసం వేయ్యి ఏళ్ల నాటి శివాలయంలోని శివలింగాన్ని ఊరి చివర 5 కిలోమీటర్ల దూరం తరలించి, రేకుల షెడ్‌లో ఉంచడం దారుణమన్నారు. ఇంతటి అన్యాయానికి పాల్పడుతున్న కేంద్రం ప్రశ్నించకపోవడం సరికాదన్నారు. పెద్ద నోట్ల రద్దు తన గొప్పేనని చెప్పుకుంటున్న చంద్రబాబు పర్యవసానాల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ చేపడుతున్న ప్రజా పోరాటానికి ఆకర్శితులవుతున్న ఇతర పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారని పార్థసారధి తెలిపారు. అయితే టీడీపీ పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను వాడుకొని ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకుంటుందని ఆక్షేపించారు. అధికార పార్టీపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని పార్థసారధి హెచ్చరించారు.

2019లో వైయస్ జగనే సీఎం
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వచ్చే ఏడాది వైయస్‌ఆర్‌ సీపీలోకి క్యూ కడతారని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు పేర్కొన్నారు. టీడీపీ సీనియర్లు కూడా వైయస్‌ఆర్‌ సీపీలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహించి తప్పించుకుంటున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించారని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను చంద్రబాబు ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్‌ విభజన ఉంటుందని మాయమాటలు చెప్పి చంద్రబాబు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, అయితే ఇప్పట్లో అది జరిగే పరిస్థితి లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీలోకి కొత్త నాయకులు రావడంతో మరింత బలోపేతమవుతుందని, 2019లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని మేక ప్రతాప్‌ అప్పారావు దీమా వ్యక్తం చేశారు.
 
Back to Top