సీబీఐ అంటేనే బాబుకు వణుకు

  • ఒక్క కేసు విచారణ జరిగినా..
  • తండ్రీకొడుకులిద్దరూ జీవితాంతం జైలుకే
  • సిట్ విచారణ కోరలు లేని పాములాంటిది
  • తప్పు చేసిన వారిని తప్పించేందుకే సిట్ 
  • ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల దాకా..
  • విశాఖను హోల్ సేల్ గా దోచేస్తున్నారు
విజయవాడః దేశంలో ఏ రాష్ట్రంలో జరగని భూ కబ్జాలు, దిగజారుడు రాజకీయాలు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల దాక హోల్ సేల్ గా విశాఖను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను నిప్పు అని చెప్పుకుంటూ చంద్రబాబు ఏపీని తుప్పు పట్టిస్తున్నారని విమర్శించారు.  బాబు అవినీతి గబ్బుతో ఏపీ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. హుద్ హుద్ విపత్తును కూడ చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకొని దోచుకున్నాడని ధ్వజమెత్తారు. రికార్డులు గోల్ మాల్ చేసేందుకే చంద్రబాబు రాత్రి పూట తిరిగారన్న అనుమానం కలుగుతోందన్నారు.  233 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు గల్లంతయ్యాయంటే ఇందులో  బాబు హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. విశాఖ భూముల కుంభకోణంలో చంద్రబాబు, మంత్రులు లోకేష్, గంటా,  ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆరోపించారు. విశాఖలో భూములు కబ్జాకు గురయ్యాయని మీడియా, ప్రతిపక్షాలు,  స్వయంగా మీ మంత్రి అయ్యన్నపాత్రుడు, కలెక్టర్, మీ మిత్రపక్ష ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు చెప్పిన కూడ ఎందుకు సీబీఐ విచారణ వేయడం లేదని బాబును నిలదీశారు. సీబీఐ అంటేనే చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని రోజా ఎద్దేవా చేశారు. ఒక్క కేసు విచారణ జరిగినా తండ్రీకొడుకులిద్దరూ జీవితాంతం జైలుకుపోతారని భయం పట్టుకుందన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా విశాఖను టీడీపీ నాయకులు ఏవిధంగా పంచేసుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రోజా తెలిపారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. 

సిట్ విచారణ కోరలు లేని పాములాంటిదని రోజా అభిప్రాయపడ్డారు.  కాలయాపన కోసమే బాబు సిట్ విచారణకు ఆదేశించారని రోజా దుయ్యబట్టారు. తప్పు చేసిన వారంతా తప్పించుకునేందుకు రాచమార్గమే సిట్ విచారణ అని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రోజా స్పష్టం చేశారు. గతంలో బాబు వేసిన సిట్ విచారణలన్నీ ఏమైపోయాయని ప్రశ్నంచారు. శేషాచలం అడవుల్లో కూలీలను ఎన్ కౌంటర్ చేసినప్పుడు సిట్ విచారణ వేశారు. ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ విచారణ వేశారు. అదేవిధంగా పుష్కరాల్లో జరిగిన ఘటనపై , వనజాక్షి విషయంలో చింతమనేని కొట్టాడా లేదన్న దానిపై విచారణకు ఆదేశించారు. కానీ, ఆ విచారణలన్నీ విచారణలాగే ఉండిపోయాయి తప్ప ఎవరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. వాటికి సంబంధించిన ఏ ఒక్క నివేదికను బయటపెట్టింది లేదని ఎద్దేవా చేశారు.   భూములు కబ్జా చేసిన దొంగ అయిన మంత్రి గంటా సీబీఐ విచారణ చేయమని బాబుకు లెటర్ రాయడం అంతా డ్రామా అని రోజా అన్నారు. భూ కబ్జా జరిగిందని మంత్రి అయన్నపాత్రుడు చెబితే, ఆయన పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని గంటా మాట్లాడుతున్నారని.....  బ్యాంకులకు మీరు కోట్లు ఎగ్గొట్టినప్పుడు, విద్యార్థులు కాలేజీల్లోఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు ప్రతిష్టను దిగజార్చలేదా అని ప్రశ్నించారు.  సీబీఐ అడిగినా బాబు వేయడనా..? వేస్తే బాబు, లోకేష్ ల లెక్క తేల్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారా..? అని గంటాను రోజా కడిగిపారేశారు. 

 లోకేష్ ఆస్తులు ఐదు నెలల్లో 22రెట్లు పెరిగాయంటే భూ కబ్జాలే కారణమని సామాన్యులు కూడ ప్రశ్నిస్తున్నారని రోజా అన్నారు. వాకాటి, గంటా, దీపక్ రెడ్డిలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు కాబట్టే వారిపై చర్యలు తీసుకోవడం లేదని రోజా ఎత్తిపొడిచారు. వాకాటిని సస్పెండ్ చేసిన బాబు, మంత్రి గంటా, దీపక్ రెడ్డిలను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని రోజా ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకుంటే తన బండారం బయటపడుతుందనే బాబు నోరుమెదపడం లేదన్నారు.  మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓటర్ రింగ్ రోడ్డు, పరిటాల హత్య కేసు, వోక్స్ వ్యాగన్ లపై ఆరోపణలు చేస్తే...సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన దమ్మున్న నాయకుడు వైయస్ఆర్ అని గుర్తు చేశారు. అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడల్లా సిట్ విచారణతో తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప...ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు ఆదేశించే దమ్ము బాబుకు లేకపోయిందన్నారు.   కేఈ ప్రజల దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలని అనౌన్స్ చేస్తే బాబు ఎందుకు దాన్ని రద్దు చేశాడని ప్రశ్నించారు. తెలంగాణలో మియాపూర్ లో అన్యాయం జరుగిందని మీ ఎమ్మెల్యేలతో మాట్లాడించారే...మరి ఇక్కడ లక్ష ఎకరాల్లో కబ్జా చేసిన టీడీపీ నాయకులమీద సీబీఐ ఎంక్వైరీ వేయాలా వద్దా బాబూ..? అని రోజా నిలదీశారు. ఏపీలో అయితే వేయొద్దు..పక్కరాష్ట్రంలో అయితే వేయాలనడం ఇదెక్కడని న్యాయమని బాబుపై నిప్పులు చెరిగారు. రైతులు, ప్రభుత్వ భూములు దోచుకుంటున్న వారికి శిక్షపడేలా చూడాలని, సీబీఐ ఎంక్వైరీ వేసి కేంద్రం గట్టి నిర్ణయం తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. 

Back to Top