ఆలయాల్లో వరుసగా అపశృతులు. అపచారాలు 

కూటమి ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణం

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

తిరుమల శ్రీవారి లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు

నాటి నుంచి ఆలయాల్లో వరసగా అపరాచాల పర్వం

తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గలో తొక్కిసలాట

మొత్తం పదుల సంఖ్యలో భక్తుల దుర్మరణం

ఆలయాల హుండీలు, లెక్కింపు కేంద్రాల్లో చోరీలు

తిరుమల పరకామణిలో కోటి విలువైన సొత్తు చోరీ

ఏ చర్య లేదు. నిందితుడికి బెయిలిచ్చి పంపించారు

మల్లాది విష్ణు ఆక్షేపణ

అశ్లీల వీడియోతో అడ్డంగా దొరికిన టీటీడీ ఛైర్మన్‌

అయినా దబాయింపు. నిస్సిగ్గుగా ఎదురుదాడి

తక్షణమే బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలి

దీనిపై చంద్రబాబు స్పందించకపోవడం హేయం

ప్రెస్‌మీట్‌లో మల్లాది విష్ణు ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అపశృతులు, అపచారాలపై వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భక్తుల్లో భయాందోళన కలిగిస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్లను ఉపయోగించుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఆలయాల భద్రత, నిర్వహణపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా, కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. 
ప్రెస్‌మీట్‌లో మల్లాది విష్ణు ఇంకా ఏమన్నారంటే..:

ఆలయాల్లో వరస ఘటనలు దురదృష్టకరం:
దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న అపశృతుల కారణంగా భక్తులు దైవ దర్శనానికి వెళ్లి సురక్షితంగా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకం తగ్గిపోతోంది.  కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆలయాల్లో జరుగుతున్న అనేక దురదృష్టకర సంఘటనలు భక్తులను కలవరపెడుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కల్తీ నెయ్యి ఆరోపణలు చేసిన తర్వాత రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో వరుసగా అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులలో తొక్కిసలాట జరిగి తిరుపతిలో ఆరుగురు మరణించడం తీవ్ర విషాదకరం. అలాగే  సింహాచలం చందనోత్సవం రోజున నాసిరకం గోడ కూలి 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గ ఆలయంలో కూడా తొక్కిసలాటకు ఏకంగా 9 మంది బలయ్యారు.

చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం:
    విజయవాడలోని దుర్గా ఆలయంలో పూజల సమయంలో గోక్షీరంలో పురుగులు బయటపడినా బాధ్యులను శిక్షించకుండా, ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపైనే చర్యలు తీసుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
    గత నెలలో శ్రీశైలం క్షేత్రంలో దర్శన సమయాన్ని తగ్గించడం, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరసన తెలిపిన శివభక్తులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసిన ఘటన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. భక్తులపై పోలీసులే లాఠీచార్జ్‌ చేయడం దురదృష్టకరం.

ప్రభుత్వ వైఫల్యమే కారణం:
    ఇటీవల కదిరి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో జరిగిన రథోత్సవం సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయని కారణంగా భక్తులు రథం చక్రాల కింద  పడి సుమారు 40 నిమిషాల పాటు నలిగిపోయారు. భక్తుల సంఖ్యకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, రెవెన్యూ, ఎండోమెంట్, పోలీసు శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి కారణం. 
    అలాగే తిరుమల పరకామణిలో ఏడాది క్రితం కోటి రూపాయల విలువైన బంగారం, వెండి చోరీ జరిగినా, దాన్ని దాచిపెట్టారు. నిందితుడిపై నామమాత్రంగా కేసు నమోదు చేసి బెయిల్‌ ఇచ్చి పంపించారు. ఇంకా చిన్న తిరుపతిగా వెలుగొందుతున్న ద్వారకా తిరుమలలో హుండీ లెక్కింపు సమయంలో భక్తులు సమర్పించిన బంగారం, మంగళసూత్రాలు దొంగిలించారు. దాదాపు రూ.8 లక్షల విలువైన సొత్తు చోరీ అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ద్రాక్షారామంలోని కపాలేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. భీమవరం ప్రాంతంలో నందీశ్వరుడి విగ్రహాన్ని పగులగొట్టడం వంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదు.

కోటప్పకొండలో మహాపచారం..! 
    పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం తయారీలో నాసిరకం బియ్యం ఉపయోగిస్తున్న ఘటన భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆలయంలో నైవేద్యం తయారీకి ఇచ్చిన బియ్యం ముక్కిన వాసన వస్తోందని అర్చకులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇదే బియ్యంతో తయారు చేసిన ప్రసాదం తిన్న ఆలయ సిబ్బందికి కడుపునొప్పి, అస్వస్థత వంటి సమస్యలు తలెత్తాయి. ఈ ఘటనతో ఆందోళన చెందిన ఆలయ సిబ్బంది బుధవారం తయారు చేసిన నైవేద్యాన్ని భక్తులకు ఇవ్వకుండా పక్కన పెట్టారు. అనంతరం ఆ ప్రసాదాన్ని తినకుండా కోతులకు ఆహారంగా వేవ
వేశారు.

బీఆర్‌ నాయుడిపై చర్యలేవి?:
    టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయారు. ఆ వీడియోలతో హిందూ సమాజం నిర్ఘాంతపోయింది.  బీఆర్‌ నాయుడు ఆ వీడియోలో తప్పు ఏముంది అని మాట్లాడారు. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని సమర్ధించుకున్నాడు. టీటీడీ గౌరవం, ఆలయ పవిత్రతను కాపాడాలంటే బీఆర్‌ నాయుడిని వెంటనే పదవి నుంచి తప్పించాలి. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.
    దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం చాలా ప్రమాదకరం. ఆలయాల్లో జరుగుతున్న ఈ సంఘటనలకు పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఇకనైనా దేవాలయాల పరిరక్షణ, భక్తుల భద్రతపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.

Back to Top