నీతులు వల్లిస్తావ్.. కనీస ధర్మం తెలియదా?

  • అసెంబ్లీకి రాని ఇద్దరు మంత్రులు
  • జిల్లాలో తిష్టవేసి క్యాంపు రాజకీయాలు
  • మెజారిటీ లేకున్నా టీడీపీ బరితెగింపు రాజకీయాలు
  • ఆనం విజయం తథ్యమన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్
నెల్లూరు: మాట్లాడితే నీతి, నిజాయితీ అనే చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులను టీడీపీలోకి తీసుకునేటప్పుడు రాజీనామా చేయించాలనే కనీస ధర్మం తెలియదా అని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు.  ఇద్దరు మంత్రులు అసెంబ్లీకి కూడా రాకుండా రెండు రోజులు తిష్టవేసి దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేసి నెల్లూరులో క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉన్నా... తెలుగుదేశం పార్టీ కుట్రతో గెలవాలని ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టిందని మండిపడ్డారు. 

నెల్లూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు  హక్కును వినియోగించుకున్న అనంతరం అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరజూపి, కేసులు పెడతామని బెదిరించి ఓట్లు వేయించుకుంటూ చంద్రబాబు సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీల వరకు కనీస గౌరవం లేకుండా జన్మభూమి కమిటీలను పెట్టి వారి అధికారాన్ని హరింపజేశారని ధ్వజమెత్తారు. పరిపాలనను గాలికొదిలేసి ఎన్నికల్లో గెలవడానికి కుట్రరాజకీయాలు చేస్తున్నారన్నారు. ఫిరాయింపుదారులు ఆత్మపరిశీలన చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top