ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి: జ్యోతుల నెహ్రూ

కోటగుమ్మం(రాజమండ్రి): పచ్చ చొక్కాల జేబులు నింపేందుకేనన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానం ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు, వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. మంగళవారం రాత్రి రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, రాజమండ్రి రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, కడియం సొసైటీ అధ్యక్షుడు గిరజాల బాబు   సబ్ కలెక్టర్ వి.విజయ రామరాజును కలిసి జిల్లాలో  ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని ఫిర్యాదు చేశారు.

జనవరి 30న వేమగిరి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను వైఎస్సార్ సీపీ నాయకుడు గిరజాల బాబు పట్టి అప్పగించినప్పటికీ వాటి పై విచారణ లేకుండా  ఏకపక్షంగా వేబిల్లులు సక్రమంగా ఉన్నాయని లారీలను వదిలివేశారని తెలిపారు. దోపిడీదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమంగా కేసు బనాయించారని విమర్శించారు. ఈ ఘటనపై తహశీల్దార్ సక్రమంగా చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక విధానం లోప భూయిష్టంగా ఉందని విమర్శించారు. దీని వల్ల ఇసుక మాఫియా పెరిగిపోయి పచ్చ చొక్కాల కు ఆదాయ వనరుగా మారిందని ధ్వజమెత్తారు.  గతంలో యూనిట్ ధర రూ.1800లకు లభించేందని ప్రస్తుతం రూ.8 వేలు వరకు ధర పలుకుతుందని పేర్కొన్నారు. దళారుల బాగుకోసం ఈ విధానం ఉందన్నారు.

వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలను అడ్డుపెట్టుకొని అన్యాయంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. గతంలో గ్రామ పంచాయితీలకు ఇసుకపై 50 శాతం ఆదాయం లభించేదని ప్రస్తుతం 15 శాతం ఇవ్వడం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు.  జిల్లాలో ప్రస్తుతం రూ.1200 కోట్ల వరకూ ఇసుక మాఫీ అక్రమ రవాణా చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇసుక మాఫియాపై శాసన మండలిలో లేవనెత్తామని, మంత్రి పీతల సుజాత ఇసుక అమ్మకాలు సక్రమంగా జరుగుతున్నాయని వివరణ ఇచ్చారని, ప్రస్తుతం గోపాలపురంలో రూ.3 కోట్లు వరకు ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ధ్రువీకరించారని దీనిపై మంత్రి పీతల సుజాత వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఇసుక మాఫియాను అరికట్టి పారదర్శకంగా ఇసుక అమ్మకాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top