విద్యుత్ కోత‌లు లేకుండా చేస్తా

పిఠాపురం (తూ.గో.జిల్లా) :

2019 ఎన్నికల్లోగా ఈ రాష్ట్రాన్ని కరెంట్ కోతల్లేని రాష్ర్టంగా చేస్తా‌నని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్థికంగా భారమైనప్పటికీ అన్నదాతల కోసం ఏడు గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తా‌నన్నారు. రైతులకు ఇబ్బంది కలగని రీతిలో పూర్తిగా పగటి పూటే కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏడవ రోజు ఆదివారం పిఠాపురంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం గొల్లప్రోలు పాతబస్టాండ్ సెంట‌ర్‌లో జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’కి హాజరైన‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పార్టీ అభ్యర్థిగా పెండెం దొరబాబును ప్రకటించారు.

రెండేళ్ల దాకా ఆస్పత్రిలో ఖాళీ లేదట!:

‘రోడ్‌షోలో కనిపించిన కొందరితో కలిసి వారి బాగోగులు తెలుసుకోవడం నాకు అలవాటు. మొన్న తిరుపతిలో 24 ఏళ్ళ యువకుడు నా దగ్గరకు వచ్చాడు. ‘అన్నా.. నా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డయాలసి‌స్ చేయించుకోవాలని ప్రఖ్యాత స్విమ్సు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వెళ్తే రెండేళ్ల వరకు ఖాళీ లేదని చెప్పారన్నా అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది‌' అని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకొస్తానన్నారు. మనకు కాకుండా పోయిన హైదరాబాద్ నగరానికి మించిన మహానగరాన్ని సీమాంధ్రలో నిర్మిస్తా‌నన్నారు. ఆ మహానగరంలో 15 నుంచి 17 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తా‌నని హామీ ఇచ్చారు. అందులో అన్ని రకాల వైద్యులూ ఉండేటట్టు చేస్తానన్నారు. ఈ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులన్నింటినీ కలిపి ఒక యూనివర్సిటీ పరిధిలోకి తెస్త్తా. ఈ వ్యవస్థను మార్చబోయే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నానని శ్రీ జగన్‌ చెప్పారు.

'పైనున్న మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, దేవుని దయతో చదువుకున్న ప్రతీ పిల్లాడికి ఉద్యోగం తీసుకురావడం కోసం ముందుండి పనిచేస్తానని మాటిస్తున్నా‌. చంద్రబాబు మాదిరిగా అన్ని ఉద్యోగాలు ఇస్తాను.. ఇన్నిస్తానంటూ అబద్ధాలు చెప్పలేను. ఒకటికి వందసార్లు అబద్ధం చెప్పి అదే నిజమని నమ్మించే చంద్రబాబు నైజం ప్రజలకు తెలియనిది కాదు. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానంటూ హామీ ఇస్తున్న బాబు కొత్తగా ఇంటికొక ఉద్యోగం ఇస్తానంటున్నారు. ఇదే చంద్రబాబు తన హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీయించి మూయించి వేశారు. 20వేల మంది ఉద్యోగులను రోడ్ల పాలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఉద్యోగాలిస్తానంటూ యువతను మోసగిస్తున్నారు.

బాబుకు ఏదీ విశ్వసనీయత ? :
అధికారం కోసం చంద్రబాబు పట్టపగలు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. దానికి ఒక హద్దూ.. పద్దూ ఉండాలి. ఆ రెండూ ఆయనకు లేవు. బాబుకు విశ్వసనీయత అంటే అర్థం తెలియదు. ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని. బాబు నైజం తెలియంది‌ కాదన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఏలేరు ఆధునీకరణ తాను పూర్తి చేస్తానన్నారు. ఈ మెట్ట ప్రాంత రైతుల కడగండ్లు తీర్చేందుకు రాజశేఖరరెడ్డి వంద కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారన్నారు. ఆయన మరణానంతరం పాలకులు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి రైతు నోట్లో మట్టికొట్టారని నిప్పులు చెరిగారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఏలేరు ఆధునీకరణ పనులను చేపట్టి ప్రతి ఎకరాకూ నీరందిస్తానని హామీ ఇచ్చారు.

Back to Top