నిమ్సు నుంచి జగన్మోహన్‌రెడ్డి డిశ్చార్జి

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి 9:15 గంటలకు నిమ్సు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని భావించిన నిమ్సు వైద్య బృందం బుధవారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆగస్టు 25న చంచల్‌గూడ జైలులోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీ జగన్ ఆరోగ్యం క్షీణించడంతో అదే నెల 29న అ‌ర్ధరాత్రి జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించడం, ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు లేకపోవడం, భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని 30న నిమ్సుకు తీసుకు వెళ్ళారు. శ్రీ జగన్ ‌నిమ్సులో కూడా 31వ తేదీ మధ్యాహ్నం వరకూ దీక్ష కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో, నిమ్సు వైద్యులు జైలు అధికారుల అనుమతితో బలవంతంగా ఫ్లూయిడ్సు ఇచ్చి దీక్ష భగ్నం చేశారు. అప్పటి నుంచీ ఆయన నిమ్సు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. బుధవారానికి శ్రీ జగన్ పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి చేయ‌వచ్చునని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చంచల్‌గూడ జైలు అధికారులకు తెలియజేయడంతో పాటు డిశ్చార్జి సమ్మరీ (వైద్య నివేదిక)ని కూడా ఇచ్చారు. దీనితో ఆయనను బుధవారం రాత్రి భారీ భద్రత మధ్య బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో చంచ‌ల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు.

శ్రీ జగన్‌కు నెల రోజుల పాటు పోషకాహారం ఇవ్వాలి: వైద్య బృందం
శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఏడు రోజులు నిరాహార దీక్ష చేసిన కారణంగా పూర్తిగా బలహీనమయ్యారని జైలు అధికారులకు ఇచ్చిన వైద్య నివేదికలో నిమ్సు వైద్య బృందం పేర్కొంది. ఆయన పూర్వపు స్థాయికి వచ్చేందుకు నాలుగు వారాల పాటు పోషక విలువలతో కూడిన ఇంటి భోజనం ఇవ్వడం మంచిదని సూచించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఇవ్వాల్సిన డైట్ చా‌ర్టును జైలు అధికారులకు అందజేశారు. శ్రీ జగన్ శరీరంలో‌ ప్రస్తుతం కెటబాలిజం (నిరాహార దీక్షలు లేదా వేరే ఏదైనా కారణాల వల్ల శరీరంలో ప్రతికూల మార్పులు కలగడం) జరిగిందని, అది అనబాలిజం (ప్రతికూల మార్పులకు లోనైన శరీరం తిరిగి యథాస్థితికి రావడం)లోకి రావాలని, దీని కోసం బలమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.

శ్రీ జగన్‌కు బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షలు అన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఇంకా కొద్దిగా నీరసంగా ఉన్నారని తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి రెండు వారాల తర్వాత తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని డిశ్చార్జి సమ్మరీలో పేర్కొన్నారు. శ్రీ జగన్ సతీమణి‌ శ్రీమతి వైయస్ భారతి బుధవారం కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన వద్దనే ఉన్నారు.‌

Back to Top