అడ్డగోలు విభజనను అడ్డుకుందాం

న్యూఢిల్లీ :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని కలిసికట్టుగా అడ్డుకుందామని సీపీఐ, సీపీఎం కేంద్ర నాయకులకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉండాలని జాతీయ స్థాయిలో అన్ని పార్టీలనూ ఆయన కోరారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టడంలో భాగంగా శ్రీ జగన్‌ నేతృత్వంలోని ఢిల్లీ వచ్చిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బృందం శనివారంనాడు సీపీఐ, సీపీఎం నాయకులతో భేటీ అయ్యారు.


అనంతరం శ్రీ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది... రేపు బీహార్‌లో జరగొచ్చు, తమిళనాడులో కావొచ్చు, బెంగాల్‌లో అవ్వొచ్చు... దేశంలో ఎక్కడైనా సరే ఇదే చేయొచ్చు. ఇది ఇక్కడితో ఆగదు. కేంద్రంలో అధికారంలో ఉంటూ, పార్లమెంటులో 272 మంది సభ్యుల బలమున్న ఎవరైనా సరే కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం ఓ గీత గీసేసి.. ‘రాష్ట్రాన్ని విభజిస్తున్నాం’ అని చెప్పేయొచ్చు. ఈ ఆటలో ప్రజలను పావుల్లా మార్చవచ్చు. ఈ వ్యవహారానికి ఇక్కడే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే ఓ కొత్త నిదర్శనాన్ని నెలకొల్పినట్టే’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానాన్ని తప్పనిసరి చేస్తూ.. తద్వారా ప్రజాభిప్రాయాన్ని వినేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 (మూడవ అధికరణ) సవరణ కోసం సీపీఎం తదితర భావసారూప్య పార్టీలతో కలిసి పోరాడతామని శ్రీ జగన్ ప్రకటించారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ ఎం‌వీ మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలశౌరి, గట్టు రామచంద్రరావులతో కూడిన పార్టీ నాయకుల బృందం తొలుత సీపీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు అతుల్‌కుమార్ అంజ‌న్‌లతో సమావేశమైంది.

శ్రీ జగన్‌ను సురవరం ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. ఉదయం 10.05 నుంచి దాదాపు గంట పాటు సీపీఐ అగ్రనేతలతో శ్రీ జగన్ బృందం చర్చించింది. తమ పోరాటానికి మద్దతు కోరుతూ ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేసింది. అయితే.. రాష్ట్ర విభజనపై తమ వైఖరిని మార్చుకునేది లేదని సీపీఐ అగ్రనాయకులు పునరుద్ఘాటించారు. అదే సమయంలో.. రాజ్యాంగంలోని మూడ‌వ అధికరణ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు దానిపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై పార్టీలో చర్చించడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు.

అనంతరం సీపీఎం కేంద్ర కార్యాలయానికి వెళ్లిన శ్రీ జగన్ బృందం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకా‌శ్‌కారత్, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావులతో సమావేశమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతు కోరుతూ వారికి కూడా వినతిపత్రాన్ని అందించింది. సీపీఎం అగ్రనేతలతో శ్రీ జగన్మోహన్‌రెడ్డి బృందం 11.30 నుంచి 12.10 వరకు జరిపిన చర్చల్లో.. విభజనకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3 సవరణ కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సమావేశం తర్వాత ఏచూరితో కలిసి శ్రీ జగన్ ‌మీడియాతో మాట్లాడారు.

ఏకపక్ష విభజన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం :
‘మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నపుడు ఇష్టానుసారంగా ఏకపక్షంగా ఏ రాష్ట్రాన్నయినా విభజించడం సరికాదు. దానికి ఓ పద్ధతి అంటూ ఉండాలి. ఆ మాటే మేం నొక్కిచెప్తున్నాం. సీపీఎం, ఇతర భావసారూప్య పార్టీలతో కలిసి వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ పోరాటం సాగిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణ కోసం మేం కలిసికట్టుగా పోరాడతాం’ అని శ్రీ జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ‌మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘దయచేసి టాపిక్‌ని మరో అంశంలోకి మళ్లించకండి. ఇది పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. ఇలాంటిది ఎక్కడ చేసినా సరే ఒక ఉదాహరణను, నిదర్శనను నెలకొల్పినట్టే. అది చాలా తప్పుడు నిదర్శనం. ఇక్కడ ఢిల్లీలో కూర్చున్నవారు ఎన్నికల లబ్ధి కోసం కేవలం ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రాన్నయినా తమ ఇష్టానుసారం విభజించవచ్చు. అందువల్ల ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీన్ని ఆపాల్సి ఉంది. దయచేసి దీన్ని ఇతరత్రా అంశాల్లోకి మళ్లించవద్దని మీ అందరినీ కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తోనే ఫుల్‌స్టాప్ పెట్టాలి :
తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌పై ప్రశ్నకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘దయచేసి టాపిక్‌ని వేరే వైపు మళ్లించకండి. ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ అందరి మద్దతు, సహకారం కావాలి. దీంట్లోకి పెటీ పాలిటిక్సు తీసుకురాకండి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను... ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది... రేపు బీహార్‌లో జరగ వచ్చు, తమిళనాడులో కావచ్చు, బెంగాల్‌లో అవ్వొచ్చు... దేశంలో ఎక్కడైనా సరే ఇదే చేయొచ్చు. ఇది ఇక్కడితో ఆగదు. కేంద్రంలో అధికారంలో ఉంటూ, పార్లమెంట్‌లో  272 మంది సభ్యుల బలమున్న ఎవరైనా సరే కేవలం ఓ రాజకీయ క్రీడలో భాగంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం ఓ గీత గీసేసి.. ‘ఇదిగో రాష్ట్రాన్ని విభజిస్తున్నాం’ అని చెప్పేయొచ్చు. ఈ ఆటలో ప్రజలను పావుల్లా మార్చవచ్చు. ఈ వ్యవహారానికి ఇక్కడే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే ఓ కొత్త నిదర్శనాన్ని నెలకొల్పినట్టే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారందరూ ముందుకురావాలి.. ఈ పోరాటానికి తోడ్పాటునివ్వాలి’ అని ‌శ్రీ జగన్ ‌విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం జనం రోడ్లపై ఉన్నారు :
‘ఆర్టికల్ 3 కింద కేంద్రానికి అధికారాలున్నాయంటూ లేఖ ఇచ్చారు కదా’గా అని మీడియా అడిగినప్పుడు.. ‘మీకు ఆ లేఖను ఇస్తాను. సరిగా చదవండి. అందులో ఏముందో చూశాక మాట్లాడండి. సీమాంధ్రలోని 60 శాతంతో సహా మొత్తం 75 శాతం జనం రాష్ట్రంలో రోడ్లపై కూర్చున్నారు. వాళ్ల అభిప్రాయాన్ని వినాలి కదా... వినడం ప్రధానం కదా... వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తే ఎలా?’ అని జగన్ ప్రశ్నించారు. ‘మా ఎజెండా సమైక్యమే’ అని ఆయన పునరుద్ఘాటించారు.

విశాలాంధ్ర కోసం రెండు అసెంబ్లీల్లో తీర్మానాలు చేశారు :
రాష్ట్ర విభజన కోసం సుదీర్ఘ కాలంగా తెలంగాణ ప్రాంతంలో డిమాండ్ ఉంది కదా అనే ప్రశ్నకు‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి బదులిస్తూ, ‘మీరు ముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రను తెలుసుకోండి. తొలుత ఆంధ్రప్రదే‌శ్ చరిత్రను అర్థం చేసుకోండి. భాషాప్రయుక్త ప్రాతిపదికన 1956లో రాష్ట్రం ఏర్పడినపుడు... తెలుగు మాట్లాడేవారందరూ ఒకటిగా ఉండటం కోసం విశాలాంధ్ర కావాలంటూ హైదరాబా‌ద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసెంబ్లీలు మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాలు చేశాయి. మీకు తెలుసా... తెలుగువారందరూ కలిసి ఉండటానికి దోహదం చేసే విశాలాంధ్ర ఏర్పాటుకు వీలు కల్పిస్తూ తెలంగాణ బిడ్డ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదే‌శ్ బడ్జె‌ట్ దేశంలో మూడ‌వ పెద్ద బడ్జెట్‌గా ఉన్న సందర్భంలో రాష్ట్రాన్ని విభజించాలంటున్నారు. హిందీవారు తర్వాత తెలుగు మాట్లాడేవారు రెండవ స్థానంలో ఉన్న సందర్భంలో విభజనకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తెలుగువారిని విడదీయాలని చూస్తున్నారు’ అని శ్రీ జగన్ ఆవేదన వెలిబుచ్చారు.

Back to Top