చింతమనేని ఆరాటం అందుకేనా

చింతమనేని దురాగతాలకు చంద్రబాబు అండదండలు

ఏలూరు: ఎప్పుడూ వివాదాల్లో ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని
ప్రభాకర్ తాజాగా అటవీ శాఖ అధికారుల మీద దాడి చేసి, మరోసారి సంచలనం రేపారు. కొల్లేరు
ప్రాంతంలో చింతమనేని 150 ఎకరాల్ని ఆక్రమించారని, అందుకే ఈ దూకుడు అంతా అని ఉద్యోగ
సంఘాల నాయకులు ఆరోపించటం మరింత సంచలనం కలిగించింది. అసలు కొల్లేరు ప్రాంతంలో ఏం
జరుగుతోందో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మటం ఖాయం.

క్రిష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి
ఉంది. పర్యావరణ పరంగా ఎంతో కీలకమైన ఈ సరస్సు పరీవాహ ప్రాంతం అటవీ శాఖ ఆధీనంలో
ఉంది. ఇక్కడ చెరువులు చేపల పెంపకానికి చాలా అనుకూలమైనవి. ఎకరాలకు ఎకరాల మేర
చెరువుల్ని ఆక్రమించి చేపల్ని పెంచుతుండటంతో రెండు జిల్లాల్లో పంట పొలాలు
చౌడుబారిపోతుండేవి. అటు సాగునీటి పారుదల అస్తవ్యస్తం అయిపోయేది. ఈ పరిస్థితుల్లో
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండు జిల్లాల్లోని రైతులు, ప్రజా
సంఘాలు, మేధావులు మొర పెట్టుకోవటం జరిగింది. దీంతో ఆపరేషన్ కొల్లేరు పేరుతో
సాహసోపేతమైన చర్యకు వైఎస్సార్ ఆదేశాలు ఇచ్చారు. రెండు జిల్లాల కలెక్టర్ల ను దగ్గర
నుంచో పెట్టి ఆక్రమించిన చేపల చెరువుల్ని ధ్వంసం చేయించారు. సుమారు 31వేల
ఎకరాల్లోని ఆక్రమించిన చేపల చెరువుల్ని ధ్వంసం చేయించారు. దీంతో రైతులోకమంతా
వైఎస్సార్ కు జేజేలు పలికింది. క్రమంగా పరిస్థితులు సద్దుమణిగాయి. వైఎస్సార్
తదనంతరం నెమ్మదిగా దురాక్రమణ దారులు తిరిగి పడగ విప్పారు.

రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దురాక్రమణ దారులు పండగ
చేసుకొన్నారు. నెమ్మదిగా చెరువుల్ని ఆక్రమించి చేపల పెంపకం మొదలెట్టేశారు. స్వయంగా
ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు రంగంలోకి దిగి మరీ దురాక్రమణలకు తెగబడ్డారు. ఈ
క్రమంలో ఆక్రమణలకు ముందు ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని కి కొల్లేరు ప్రాంతం
బాగా నచ్చింది. చింతమనేని స్వయంగా 150 ఎకరాల్లో పాగా వేశారన్నది తాజాగా
వినిపిస్తున్న మాట. ఈ మాటను ఉద్యోగ సంఘాల నేతలే కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఈ
150 ఎకరాల చేపల చెరువులకు మేత, ఎరువులు తీసుకెళ్లాలంటే ఊరుని, ప్రధాన చెరువుల్ని
చుట్టి తీసుకొని వెళ్లాలి. అదంత ఎందుకు అనుకొన్న చింతమనేని నేరుగా ప్రధాన చెరువు
మార్గాన్ని అడ్డంగా మట్టి వేసి రోడ్ నిర్మించుకొనేందుకు గతంలో ప్రయత్నించారు. దీని
మీద ఉన్న నిబంధనల్ని చూపించి అటవీశాఖ అధికారులు అడ్డుకొన్నారు. దీంతో పగ బట్టిన
చింతమనేని రాత్రికి రాత్రి రోడ్ వేయించి తడాఖా చాటుకొన్నారు. అడ్డు వచ్చిన అటవీ
అధికారుల్ని తరిమి తరిమి కొట్టారు. దీంతో పారిపోయి సిబ్బంది ప్రాణాలు దక్కించుకొని
పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. నామ్ కే వాస్తీగా ఫిర్యాదు నమోదు చేసుకొన్న
పోలీసు అధికారుల్ని ఫిర్యాదును పెండింగ్ లో పెట్టేసి చేతులు దులుపుకొన్నారు. 

Back to Top