పులివెందుల :నియోజక వర్గంలోని వేముల మండలంలో ఉన్న యుసీఐఎల్ పరిధిలోని భూ నిర్వాసితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిలు పాలకులు, అధికారులను డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో యుసీఐఎల్ గ్రీవెన్‌సెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యంగా హాజరు కావాల్సిన యుసీఐఎల్ అధికారులు రాకపోవడంతో కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జమ్మలమడుగు ఆర్డీవో వినాయకంకు సమస్యలు వివరించారు. <br/>ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... యుసీఐఎల్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇచ్చినా , ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. మరికొంతమందికి ఉద్యోగం ఇచ్చి, పరిహారం ఇవ్వలేదన్నారు. పరిహారం కోసం , ఉద్యోగం కోసం అనేక సార్లు యుసీఐఎల్ అధికారులకు బాధితులు, కమిటీ సభ్యులు వివరిస్తున్నా కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదన్నారు. ఈ కమిటీని మరోసారి ఏర్పాటు చేసి యుసీఐఎల్ బాధిత గ్రామాల్లో సమస్యలపై క్షుణ్ణంగా చర్చించి పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్క బాధితుని సమస్యను విని ఉపాధి, పరిహారం వస్తుందో రాదోతేల్చిచెప్పాలన్నారు. యుసీఐఎల్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.<br/><br/>