18, 19న విజయమ్మ మళ్ళీ ఫీజు దీక్ష

హైదరాబాద్, 14 జూలై 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఫీజు రీయింబర్సుమెంటు కోసం మరోసారి ఉద్యమించనున్నారు. విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదవాలన్న సదాశయంతో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ నెల 18,19 తేదీల్లో శ్రీమతి విజయమ్మ హైదరాబాద్‌లో 'ఫీజు దీక్ష' పేరిట నిరాహార దీక్ష చేస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాలు, కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి వెల్లడించారు. శ్రీమతి విజయమ్మ దీక్షలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడుతూ.. ఆర్థికంగా పేరదవారైనా చదువులో వెనుకబడకూడదని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంటు పథకానికి రూపకల్పన చేశారని గుర్తుచేశారు. ఇలాంటి పథకానికి ఏదో ఒక విధంగా గండికొట్టేందుకు కిరణ్‌ ప్రభుత్వం దొడ్డి దారిన చిల్లులు పొడుస్తూనే ఉందని. నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉందని ఆయన దుయ్యబట్టారు. గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పటికీ ఏదో విధంగా భారాన్ని తగ్గించేకోవాలన్న దృష్టితో వ్యవహరించడం తప్పుడు విధానమని, చాలా దుర్మార్గమైనదని అన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గతంలోనే ఫీజు దీక్షలు చేసిన వైనాన్ని మైసూరా గుర్తుచేశారు.

ప్రభుత్వం ఈ ఏడాది రూపొందించిన విధానం వల్ల దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 75 వేలు వరకూ విద్యార్థులందరూ చెల్లించాల్సి ఉంటుందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త విధానం పేద విద్యార్థులకు ఏమాత్రం ప్రయోజనకారి కాదన్నారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయడమంటే పేదల కడుపు కొట్టడమే అవుతుందని ఆయన అభివర్ణించారు. మానవ వనరులు మన దేశానికి ఒక పెద్ద పెట్టుబడి లాంటిదన్నారు. మానవ వనరుల ద్వారా దేశం ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మైసూరారెడ్డి తెలిపారు.

Back to Top