క్షీణిస్తున్న విజయమ్మ ఆరోగ్యం

గుంటూరు, 22 ఆగస్టు 2013:

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ నిరవధిక నిరాహార దీక్ష (సమరదీక్ష) చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలంటూ ఆమె గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరశన దీక్ష గురువారానికి నాలుగవ రోజుకు చేరింది.

ఈ సందర్భంగా గురువారం ఉదయం వైద్యులు శ్రీమతి విజయమ్మకు గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీమతి విజయమ్మ పల్సు, బి.పి, సుగర్‌ స్థాయిలు బాగా పడిపోయాయని వైద్యులు తెలిపారు. ఆమె తక్షణమే దీక్ష విరమించాలని, ద్రవాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. శ్రీమతి విజయమ్మను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని లేకపోతే మరింతగా ఆమె ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు డాక్టర్‌ సునీత తెలిపారు.

అయితే, సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకూ తాను దీక్ష విరమించేది లేదని, ద్రవాహారం తీసుకోవడానికి కూడా ఆమె నిరాకరిస్తున్నారని వైద్యుల తెలిపారు. సాధారణంగా రక్తంలో చెక్కెర స్థాయి 80 నుంచి 120 మధ్య ఉండాలి. అయితే మంగళవారం శ్రీమతి విజయమ్మ రక్తంలో 90 ఉన్న చెక్కెర స్థాయి బుధవారం ఉదయానికి ఒక్క సారిగా 74కు పడిపోయింది. దీనితో సెలైన్లు పెడతామని వైద్యులు చెప్పినా ఆమె నిరాకరించారని డాక్టర్‌ సునీత చెప్పారు. చెక్కెర స్థాయి తగ్గడం వల్ల మూత్రపిండాలు, ఇతర అవయవాల పని తీరు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇతర వైద్య పరీక్షలు చేయించుకోవడానికి శ్రీమతి విజయమ్మ నిరాకరిస్తున్నాని పేర్కొన్నారు.

Back to Top