ప.గో. జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

ఏలూరు, 28 అక్టోబర్ 2013:

భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రాంతాలలో సోమవారంనాడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటిస్తున్నారు. కృష్ణా‌ జిల్లాలో ఆదివారం పర్యటించి వరద బాధితులను ఆమె పరామర్శించారు. వరద బాధిత రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా శ్రీమతి విజయమ్మ నేడు పశ్చిమ గోదావరి, రేపు తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు.

ఉంగుటూరు మండలం నారాయణపురంలో పంట పొలాలను ఆమె నేడు పరిశీలించనున్నారు. అలాగే తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామంలో రైతులను శ్రీమతి విజయమ్మ పరామర్శిస్తారు. ఇరగవరం మండలం గోటేరు, గొల్లకుంటపాలెంలలోని పంట నష్టాలను పరిశీలిస్తారు. ఆచంట, ఏలేటిపాడు, వేమవరం వరద ప్రాంతాల్లోనూ శ్రీమతి విజయమ్మ పర్యటిస్తారు.

గడచిన ఐదు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందుల పాలైన రైతులు, ప్రజలను స్వయంగా పరామర్శించాలని, బాధితులకు అండగా నిలవాలని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముందుగా భావించారు. అయితే.. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించడంతో తన మాతృమూర్తి శ్రీమతి విజయమ్మను వరద బాధితులను వద్దకు పంపించారు.

విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టంవాటిల్లింది. పత్తి, వేరుశనగ తదితర పంటలు కూడా బాగా నష్టపోయాయి. వర్షాల వల్ల జిల్లాలో 635 ఇళ్లు, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. పలు పశువులు మృతి చెందాయని సమాచారం.

Back to Top