శ్మశానంగా మార్చిన బాబూ స్వర్ణాంధ్ర చేస్తావా?

కర్నూలు :

తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల ఉసురుతీసి రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానంటే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీమతి విజయమ్మ చేస్తున్న పర్యటన మూడవ రోజు శనివారం కర్నూలు జిల్లాలో కొనసాగింది. నంద్యాల నుంచి బండి ఆత్మకూరు, వెలుగోడు, నల్లకాల్వ, ఆత్మకూరు, కరివేన, పాములపాడు, జూపాడుబంగ్లా, నందికొట్కూరులలో ఆమె రోడ్‌షోలు నిర్వహించి, బహిరంగ సభల్లో ప్రసంగించారు. మహానేత సతీమణిని చూసేందుకు ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారు.

‘అది చేస్తా.. ఇది చేస్తానంటూ చంద్రబాబు ఇప్పుడు దొంగ హామీలిస్తున్నారు.‌ సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబూ నువ్వు ఏం చేశావని చూస్తే.. ప్రభుత్వం ఇచ్చే జనతా వస్త్రాల పథకాన్ని తీసేసి ఆప్కోను నిర్వీర్యం చేశావు. అందులో పనిచేసే కార్మికుల ఆత్మహత్యలకు ప్రధాన కారకుడవయ్యావు. మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలలకొకసారో, ఆరు నెలలకొకసారో జీతాలు ఇచ్చి.. వారి కుటుంబాలను ఇబ్బందులు పెట్టావు. ఎన్‌టీ రామారావు కిలో రూ.2 కే ఇచ్చిన బియ్యం ధరను రూ.5.25కు పెంచావు. జన్మభూమి, శ్రమదానం అంటూ జనం చేతే పనులు చేయించి రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా చేశావు’ అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు.

Back to Top