మహానేత స్మృతివనంలో విజయమ్మ కన్నీరు

నల్లకాల్వ (కర్నూలు జిల్లా) :

‘మనసుకు కష్టంగా అనిపిస్తోంది. ఆత్మకూరును తలచుకుంటేనే ఏదోలా ఉంటుంది. ఇక్కడకు రావాలన్నా బాధేస్తోంది’ - మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అమరుడైన కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నల్లకాల్వ వద్దకు చేరుకున్నపుడు.. ఆయన సతీమణి, వైయస్ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆవేదన ఇది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీమతి విజయమ్మ శనివారం కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆమె రాకతో స్థానికుల గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. బండి ఆత్మకూరు, వెలుగోడు, నల్లకాల్వ, ఆత్మకూరు పరిధిలోని దారుల్లో జనం బారులుతీరారు.

నల్వకాల్వలో రెండు నిముషాలు మాట్లాడాలని స్థానికులు పట్టుబట్టడంతో శ్రీమతి విజయమ్మ కొంత సేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ ప్రాంతమంతా మూగబోయింది. కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. తేరుకున్న అనంతరం శ్రీమతి విజయమ్మ స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. వైయస్ పాలనను గుర్తుచేస్తూ.. ఆయన తదనంతర పాలనను ఎండగడుతూ.. మాట్లాడారు. స్మృతివనంలోని మహానేత భారీ విగ్రహం వద్ద ఆమె కన్నీటిపర్యంత‌ం అయ్యారు. బండి ఆత్మకూరు, వెలుగుడులో గద్గద స్వరంతో మాట్లాడిన శ్రీమతి విజయమ్మను చూసిన అందరూ ఖిన్నులయ్యారు.‌

Back to Top