న్యూఢిల్లీ, 8 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్‌రెడ్డి కేసు విషయంలో సిబిఐ అనుసరిస్తున్న తీరును ఆమె రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు. దాదాపు అరగంట పాటు ప్రణబ్‌తో విజయమ్మ భేటి అయ్యారు.
రాష్ట్రపతితో భేటి అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతిగా గెలిచిన ప్రణబ్‌ను అభినందించినట్లు తెలిపారు. జగన్ బాబుకు బెయిల్ వస్తే ఆయనే వచ్చి ప్రణబ్‌ను అభినందిస్తారని ఇంతకాలం వేచి చూశామన్నారు. తాము చెప్పిన విషయాలను విన్న రాష్ట్రపతి పరిశీలిస్తామని హామీ ఇచ్చారని విజయమ్మ చెప్పారు. సిబిఐ వ్యవహార శైలిపై రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పారు. తమకు జరిగిన అన్యాయం గురించి రాష్ట్రపతికి వివరించామన్నారు. విజయమ్మతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రణబ్‌ను కలిశారు.
కాగా, సిబిఐ కక్షపూరిత వైఖరిని రాష్ట్రపతికి వివరించినట్లు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు.
గతంలో ప్రధానికి చెప్పిన విషయాలనే ఇప్పుడు రాష్ట్రపతికి వివరించామన్నారు. జగన్‌కు బెయిల్ విచారణకు ముందు రోజే టిడిపి నేతలు కాంగ్రెస్ పెద్దలను కలిశారని చెప్పారు. కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని టిడిపి నేతలు కలిసిన తరువాతే ఈడీ ఆస్తుల జప్తు వ్యవహారం జరిగిందని అన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయిన విషయాన్నే ప్రణబ్ ముఖర్జీకి తెలియజేశామని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుంగా సిబిఐ అడ్డుపడుతోందని మేకపాటి ఆరోపించారు.z