సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి

లక్కిరెడ్డిపల్లె: ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలోని ఆయా శాఖల అధికారులతో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాల్లో రైతులకు సంబంధించిన భూములు ఇప్పటి వరకు కూడా ఆన్‌లైన్‌లో నమోదు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీఆర్‌ఓల ద్వారా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ వెంకటరమణకు సూచించారు. రేషన్‌ కార్డులకు అనేక పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదన్నారు. అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా పేదలకు డీ ఫారాలు అందజేసేలా చూడాలన్నారు. నాలుగు నెలలుగా ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు బిల్లులు రాని విషయాన్ని ఎంపీడీఓ రవికుమార్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్‌లు అందేలా చూడాలని ఆయన కోరారు. బీసీ కార్పొరేషన్‌ రుణాలకు కూడా జన్మభూమి కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలా..? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్‌ రెడ్డి, ఎంపీపీ రెడ్డెయ్య, ఎంపీపీ రెడ్డెయ్య, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ వెంకటనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సయ్యద్‌ అమీర్, సర్పంచ్‌ దిన్నెపాడు రవిరాజు, నాయకులు సుబ్బరాజు, వెంకటేష్, జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top