షర్మిల పాదయాత్రపై థీమ్‌ సాంగ్‌ ఆవిష్కరణ

- సీడీ ఆవిష్కరించిన వైయస్ విజయమ్మ
- పాదయాత్రలో వినియోగించే అంబులె‌న్స్‌ ప్రారంభం

హైదరాబాద్, ‌17 అక్టోబర్‌ 2012: ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి షర్మిల ప్రారంభించనున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ప్రాధాన్యతను వివరిస్తూ రూపొందించిన థీమ్ సాంగ్‌ సీడీని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. 'వస్తున్నాయొస్తున్నాయ్.. అవిగో, జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్.. ఇవిగో !’ అంటూ ఈ థీమ్‌ సాంగ్‌ను ‌యువ సినీ గేయ రచయిత అనంత శ్రీరాం రాశారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే విషయాలను రచయిత పదాలతో అందంగా కూర్చారు. వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌య‌స్ జగ‌న్మోహ‌న్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను గురువారం నుంచి చేస్తున్న విషయం తెలిసిందే.

మాజీ ఎంపీ హరిరామ జోగయ్య, రచయిత రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో అనంత శ్రీరాం రచించిన ఈ పాటకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు. సీడీ రూపకల్పనకు ఆకెన వీరాస్వామి‌ (అబ్బు) సహకారాన్ని అందజేశారు.

సిడి విడుదల సందర్భంగా రచయిత అనంత శ్రీరాం మాట్లాడుతూ, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారని అన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనే ఒక సంకల్పంతో షర్మిల మరో ప్రజా ప్రస్థానం చేపట్టారని అన్నారు. మహాకవి శ్రీశ్రీ రాసిన పాటను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు వివరించారు.

అందుబాటులో వైద్య సేవలు:
షర్మిల పాదయాత్ర సందర్భంగా వైద్య సేవలు అందుబాటులో ఉంచడానికి వీలుగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌వైద్యుల విభాగం, హనుమాన్ జంక్ష‌న్‌కు చెందిన డాక్టర్ దుత్తా శాంతివర్ధ‌న్ ట్రస్టు ఏర్పాటు చేసిన అంబులె‌న్స్‌కు విజయమ్మ మంగళవారం రాత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వైద్య విభాగం కన్వీనర్ డాక్ట‌ర్ గోసుల శివభా‌రత్‌రెడ్డి మాట్లాడుతూ, 15 మంది వైద్యులు, పది మంది నర్సింగ్ సిబ్బంది, నలుగురు ఫిజియో థెరపిస్టుల బృందం అంబులె‌న్స్ వెంట ఉంటుందన్నారు. షర్మిల పాదయాత్ర ప్రారంభం నాటికి అంబులె‌న్స్‌కు ఒక ప్రత్యేక ఫోన్‌ ఏర్పాటు చేస్తామని, ఆ నంబర్ అందరికీ తెలియజేస్తామని శివభా‌రత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, డి.ఎ.సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.

ఫేస్‌బుక్‌లో పేజీ ఏర్పాటు:
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు పొందుపర్చడానికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఐటీ కమిటీ ‘ఫే‌స్‌బుక్’లో ఒక పేజీని (www.facebook.com/maroprajaprasthanamysrcp)ప్రారంభించింది. ఈ ఫే‌స్‌బుక్ పేజీని వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. ‌ఐటి కమిటీ కన్వీన‌ర్ చల్లా మధుసూదన్‌రెడ్డి ఫేస్‌బుక్ పేజీ వివరాలను మీడియాకు వెల్లడించారు. పాదయాత్ర సమాచారాన్ని ప్రతి మూడు గంటలకు ఒకసారి ఫేస్‌బుక్‌లో పొందుపరుస్తూ ఉంటామని తెలిపారు. 
Back to Top